Begin typing your search above and press return to search.

నెల్లూరులో కోట్లు కురిపిస్తున్న క్వార్ట్జ్.. టీడీపీలో బిగ్ ఫైట్

ఇంతటి విలువైన ఖనిజాన్ని కారుచౌకగా దొంగ చాటుగా కొట్టేస్తున్నారు స్థానిక నేతలు.

By:  Tupaki Desk   |   19 Dec 2024 5:30 PM GMT
నెల్లూరులో కోట్లు కురిపిస్తున్న క్వార్ట్జ్.. టీడీపీలో బిగ్ ఫైట్
X

ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏమున్నది గర్వకారణం.. అంతా అవినీతిమయం అంటున్నారు నెల్లూరు జిల్లా వాసులు. ఉమ్మడి నెల్లూరు జిల్లా అంటే ఒకప్పుడు అక్వా సాగుకు, నాణ్యమైన బియ్యం సాగుకు ప్రసిద్ధి. కానీ ఇప్పుడు అక్కడ తెల్ల బంగారంగా చెప్పే క్వార్ట్జ్ రాయి కోట్ల రూపాయల నోట్ల వర్షం కురిపిస్తోంది. ఈ జిల్లాలో లభ్యమైయ్యే క్వార్ట్జ్కు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. చైనాతోపాటు పశ్చిమాసియా దేశాల్లో టన్నుకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షలు చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. ఇంతటి విలువైన ఖనిజాన్ని కారుచౌకగా దొంగ చాటుగా కొట్టేస్తున్నారు స్థానిక నేతలు. కొందరు మైనింగ్కు అనుమతులు తీసుకుని తవ్వుతుండగా, మరికొందరు అధికారం అడ్డం పెట్టుకుని అందినంత దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

వైసీపీ అధికారంలో ఉండగా, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ పెద్దమంత్రి కనుసన్నల్లో క్వార్ట్జ్ మైనింగ్ జరిగేది. స్థానికంగా ఉన్న ఇద్దరు మంత్రులపైనా ఈ దందాల ఆరోపణలు భారీగానే ఉన్నాయి. లక్షల టన్నుల ఖనిజాన్ని విదేశాలకు అక్రమంగా తరలించారని ఎప్పటికప్పుడు ఫిర్యాదు వచ్చేవి. టీడీపీకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్వార్ట్జ్ గనుల్లో రాత్రిపగలూ తేడా లేకుండా ఆందోళనలు చేసి ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువెళ్లారు. కానీ, అప్పట్లో పెద్దగా స్పందన లేకపోవడంతో దీన్ని ఎన్నికల్లో ప్రచారం చేసుకుని లబ్ధి పొందింది టీడీపీ.

ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అక్రమ మైనింగుపై విచారణ చేయిస్తారని, కోట్ల రూపాయల ప్రక్రుతి సంపదను దోచేసిన నేతలపై చర్యలు తీసుకుంటారని అంతా ఆశించారు. అయితే ప్రస్తుతం మైనింగ్ లైసెన్సులు లేకపోయినా, తవ్వకాలు మాత్రం ఆగలేదని చెబుతున్నారు. అధికారం అండతో కొందరు నేతలు రహస్యంగా తమ పని కానిచ్చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఓ ఎంపీకి సన్నిహితుడైన నెల్లూరు నేత ఒకరు క్వార్ట్జ్ మైనింగును తన చేతుల్లోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీలో ఓ కీలక నేతకు సమీప బంధువైన ఈ నేత ఎన్నికల ముందే టీడీపీలో చేరారు. అప్పట్లో వైసీపీలో ఉండగా, క్వార్ట్జ్ గనులను ఈ నెల్లూరు నేతే పర్యవేక్షింవారు. ఆ అనుభవంతో ఇప్పుడు కూడా చక్రం తిప్పుదామని ఆయన ముందుకు రాగా, ఓ ఎంపీ పూర్తిగా సహకరిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే నెల్లూరు నేత ప్రమేయాన్ని స్థానిక శాసనసభ్యులు వ్యతిరేకిస్తున్నారు.

వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఎక్కువగా లభ్యమయ్యే క్వార్ట్జ్ తోపాటు సిలికా శాండ్ కోసం కూటమిలో కుమ్ములాటలు ఈ మధ్య బాగా ఎక్కువయ్యాయనే టాక్ వినిపిస్తుంది. ఆ నియోజకవర్గాలకు చెందిన స్థానిక నేతలు కూడా మైనింగ్ చేసేందుకు ముందుకు వస్తే, గత ఎన్నికల్లో పార్టీలోకి వచ్చి కీలకంగా మారిన బడా నేత మాత్రం గనుల్లో ఇంకెవరూ జోక్యం చేసుకోవద్దని వార్నింగులిస్తున్నట్లు చెబుతున్నారు. కూటమి ముఖ్య నేతలు కూడా ఈ బడా నేతకే మద్దుతు ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో బాగా ఖర్చుచేసిన సదరు బడా నేతకు ఆర్థికంగా మేలు చేయాలనే నిర్ణయంతో స్థానిక నేతలను నియంత్రిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో కూటమిలో ముఖ్యంగా టీడీపీలో మైనింగుపై అంతర్గత యుద్ధం జరుగుతోందంటున్నారు.