"సీఎం" ఉత్తమ్.. 100 కోట్లు ఢిల్లీకి పంపారు.. బీజేపీ సంచలన ఆరోపణ
ఏడాది కిందటి వరకు అసలు ఏమాత్రం అంచనాలు లేని స్థితి నుంచి తెలంగాణలో ఏ ముహూర్తాన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో కానీ
By: Tupaki Desk | 21 May 2024 10:12 AM GMTఏడాది కిందటి వరకు అసలు ఏమాత్రం అంచనాలు లేని స్థితి నుంచి తెలంగాణలో ఏ ముహూర్తాన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో కానీ.. అప్పటినుంచి ఈ సర్కారు ఎక్కువ కాలం ఉండదంటూ ప్రత్యర్థి పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ తెగ హడావుడి చేస్తున్నాయి. అసలే కేంద్రంలోని బీజేపీకి రాష్ట్రాల్లోని ప్రత్యర్థి పార్టీల ప్రభుత్వాలను కూలుస్తున్న చరిత్ర ఉంది. మోదీ-షా ద్వయం ఎంతకైనా తెగిస్తారన్న చెడ్డ పేరు మూటగట్టుకున్నారు. మహారాష్ట్రలో శివసేనను చీల్చి శిందే సర్కారు ఏర్పాటు.. బిహార్ లో నీతీశ్ కుమార్ ను బుట్టలో వేసుకోవడం.. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింథియాను ఆకర్షించడం ఇలా అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కి వచ్చింది.
బీఆర్ఎస్ దీ అదే పాట
తెలంగాణను పదేళ్ల పాటు ఏకధాటిగా పరిపాలించిన బీఆర్ఎస్ దీ ఇదే తీరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని.. ఆ పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు 20-30 మంది తమతో టచ్ లో ఉన్నారంటూ గులాబీ పార్టీ అగ్ర నేతలే వ్యాఖ్యానించారు. ఇక బీజేపీది ఇంకొంత భిన్న పంథా. కాంగ్రెస్ నుంచి తమ పార్టీలోకి ఎమ్మ్యెల్యేలు వస్తారంటూ కొందరు కమలం పార్టీ నేతలు వ్యాఖ్యలు చేశారు.
తక్కువ మెజారిటీ కావడంతో
తెలంగాణలో నవంబరు చివర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లు గెలిచింది. సాధారణ మెజారిటీకి ఇది 4 మాత్రమే ఎక్కువ. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థి బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రభుత్వం కూలిపోతుందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటన్నిటికీ మించి తాజాగా బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణకు దిగారు.
100 కోట్లు.. ఉత్తమ్ సీఎం
తెలంగాణ కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్న నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాగా, ఉత్తమ్ 2018 ఎన్నికల సమయానికి పీసీసీ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో పదవికి రాజీనామా చేశారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మొదటినుంచి హస్తం పార్టీనే నమ్ముకుని ఉన్నారు. అయితే, వీరిద్దరినీ కాదని 2017లో పార్టీలో చేరి, 2021లో పీసీసీ అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సీఎంను చేసింది. దీనిపై ఉత్తమ్, కోమటిరెడ్డి ఏమీ మాట్లాడకుండా అంగీకరించారు. అయితే, ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం పదవి కోసం రూ.100 కోట్లను ఢిల్లీకి పంపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ ‘‘యు (ఉత్తమ్)’’ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మొన్న రూ.500 కోట్లు చేతులు మారాయని.. వీటిలోంచి రూ.100 కోట్లను ఉత్తమ్ ఢిల్లీకి పంపారని.. దీని ఉద్దేశం సీఎం రేసులో తానూ ఉన్నానని చెప్పడమే అని ఏలేటి అన్నారు. దీనిపై ఉత్తమ్,ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.