ఉచిత గ్యాసు.. 'పెద్ద తిరకాసు'.. కూటమికి మేలేనా?
అయతే.. ఇప్పుడు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల విధానంపై సర్కారు గోప్యత పాటిస్తోంది. ఉచిత పథకాన్ని అమలు చేస్తామని చెప్పినా.. ఎవరికి ఇస్తారనే విషయంలో మంత్రులు, నాయకులు నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు.
By: Tupaki Desk | 23 Oct 2024 1:30 PM GMTఈ నెల 31న రానున్న దీపావళి పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన 'ఉచిత వంట గ్యాస్' పథకానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గృహిణులకు ఏటా మూడు వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎన్నికల కు ముందు హామీ ఇచ్చారు. ఇది బాగానే వర్కవుట్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఎలా ఇస్తారు?
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ..ఎలాంటి ఆంక్షలు లేకుండా.. ఈ పథకాన్నిఅమలు చేయాల్సి ఉంది. ఎన్నికల సమయంలో మీడియా అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఇదే సమాధానం చెప్పారు. ఆంక్షలు ఏమీ లేవని.. అందరికీ గ్యాస్ ఇస్తామని.. ఎంత మంది ఉన్నా.. ప్రతి ఏటా మూడు సిలిండర్లను అందిస్తామన్నారు. ఆ తర్వాత తమ్ముళ్లు దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లా రు. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.
తిరకాసు ఏంటి?
అయతే.. ఇప్పుడు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల విధానంపై సర్కారు గోప్యత పాటిస్తోంది. ఉచిత పథకాన్ని అమలు చేస్తామని చెప్పినా.. ఎవరికి ఇస్తారనే విషయంలో మంత్రులు, నాయకులు నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలు మాత్రం మౌనంగా ఉన్నారు. మంత్రులు చెబుతున్న లెక్క ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'దీపం' పథకం లబ్ధిదారులకు మాత్రమే ఉచిత గ్యాస్ అందుతుందని అంటున్నారు.
దీనికే కనుక సర్కారు కట్టుబడితే.. మెజారిటీ మహిళలకు ఈ ఉచిత పథకం అందే పరిస్థితి ఉండదు. ఎలాగంటే.. కేంద్రం అమలు చేస్తున్న 'ఉజ్వల' పథకాన్ని రాష్ట్రంలో దీపం పేరుతో అమలు చేస్తున్నారు. ఈ పథకం కేవలం అత్యంత వెనుకబడిన వర్గాలకు మాత్రమే అమలు చేస్తున్నారు. ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి ఇలాంటి గ్యాస్ కనెక్షన్లు 70 వేల నుంచి లక్ష లోపు మాత్రమే ఉన్నాయి. వీరికి మాత్రమే ఉచితంగా గ్యాస్ ఇస్తే.. మిగిలిన వారిలో ఆవేదన, ఆందోళన ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు. కాబట్టి.. మెజారి మహిళలను పరిగణనలోకి తీసుకుని ఈ పథకం అమలు చేస్తే.. కూటమికి మేలు చేస్తుందన్న సూచనలు వస్తున్నాయి.