Begin typing your search above and press return to search.

అదే జ‌రిగితే.. కూట‌మికి మ‌రింత బూస్ట్‌..!

కొన్ని కొన్ని విష‌యాలు అనుకున్న‌వి అనుకున్న‌ట్టుగా జరిగితే.. ఆ మ‌జానే వేరుగా ఉంటుంది. ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వంలోనూ ఇదే త‌ర‌హా వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   28 Feb 2025 12:29 PM IST
అదే జ‌రిగితే.. కూట‌మికి మ‌రింత బూస్ట్‌..!
X

కొన్ని కొన్ని విష‌యాలు అనుకున్న‌వి అనుకున్న‌ట్టుగా జరిగితే.. ఆ మ‌జానే వేరుగా ఉంటుంది. ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వంలోనూ ఇదే త‌ర‌హా వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా జ‌రిగితే.. 9 నెల‌ల పాల‌న‌కు ప్ర‌జ‌ల నుంచి భారీ మ‌ద్ద‌తు ల‌భించిన‌ట్టు అవుతుంద‌న్న ఆశాభావం ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌లో క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా జ‌రిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రెండు స్థానాల‌కు నేరుగా టీడీపీ పోటీ చేసింది. ఈ ఎన్నిక‌లు.. ప్ర‌త్య‌క్షంగా ప్ర‌జ‌ల‌తో ముడిప‌డి ఉండ‌డం, అందునా.. చ‌దువుకున్న వారితో మ‌మేక‌మై ఉండ‌డంతో స‌ర్కారు చాలానే ఆశ‌లు పెట్టుకుంది. రెండు గ్రాడ్యుయేట్ స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంటే.. అది చంద్ర‌బాబు పాల‌న‌, విజ‌న్‌ల‌కు విద్యావంతుల నుంచి ద‌క్కిన గొప్ప ప్ర‌శంస‌గానే మిగ‌ల‌నుంది.

ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే గురువారం అర్ధ‌రాత్రి సీఎం చంద్ర‌బాబు ఎన్నిక‌ల పోలింగ్ స‌ర‌ళిపై జిల్లాల నాయ‌కుల‌తో ఆరా తీశారు. పోలింగ్ జ‌రిగిన తీరును కూడా ఆయ‌న తెలుసుకున్నారు. ఎక్క‌డెక్క‌డ లోపా లు ఉన్నాయి? ఎన్నిక‌ల పోలింగ్ ప‌ర్సంటేజీ ఎందుకు త‌గ్గింద‌న్న విష‌యాల‌పై కూడా.. నాయ‌కుల‌ను ప్ర‌శ్నించిన‌ట్టు తెలిసింది. ఆది నుంచి అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా ఉండాల‌ని చెప్పినా.. తూర్పులో లోపాలు ఎక్కువ‌గా క‌నిపించ‌డంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం.

అదేస‌మ‌యంలో పోలింగ్ విష‌యంలో చాలా ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించిన నాయ‌కుల జాబితాను కూడా త‌న‌కు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు ఇంచార్జ్‌ల‌ను ఆదేశించారు. ఈ విష‌యాల‌ను గ‌మ‌నిస్తే.. సీఎం చంద్ర‌బాబు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల విష‌యంలో ఎంత సీరియ‌స్‌గా ఉన్నారో అర్థ‌మ‌వుతుంది. ఇక‌, తాజాగా చంద్ర‌బాబుకు అందిన నిఘా వ‌ర్గాల స‌మాచారం కూడా.. విజ‌యం కూట‌మిదేన‌ని.. ఖ‌చ్చితంగా విజ‌యం ద‌క్కించుకుంటార‌నే! ఇదే జ‌రిగితే.. కూట‌మి ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ఉంద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతంద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది.