దుబాయ్ తర్వాత ఏపీనే... కూటమి సర్కార్ ఇంట్రస్టింగ్ స్టెప్!
దేశంలోనే తొలిసారిగా ఏపీ సర్కార్ పౌరసేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, కీలక సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు వాట్సప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది.
By: Tupaki Desk | 12 Dec 2024 6:15 AM GMTఏపీలో ఇకపై కీలక సమాచారం కోసం అటూ ఇటూ చూడనవసరం లేదు.. గూగుల్ లో వెతకనవసరం లేదు.. నేరుగా వాట్సప్ కు ప్రభుత్వం నుంచి మేసేజ్ వచ్చేస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారిక వాట్సప్ నంబర్ ను త్వరలో ప్రకటించనుంది.. ఆ అకౌంట్ కు వెరిఫైడ్ ట్యాగ్ ఉంటుంది. ఈ నంబర్ వన్ స్టాప్ సెంటర్ లా పనిచేస్తుందని అంటున్నారు.
అవును... దేశంలోనే తొలిసారిగా ఏపీ సర్కార్ పౌరసేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, కీలక సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు వాట్సప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో తొలిదశలో సుమారు 153 రకాల సేవలు అందించనున్నారు. భవిష్యత్తులో వీటిని మరింత విస్తృతం చేయనున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు... వాట్సప్ సేవల ద్వారా జారీచేసే పత్రాలకు చట్టబద్ధత ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో... వాట్సప్ ద్వారా వచ్చే వినతులు, అందిస్తున్న పౌరసేవలపై ఎప్పటికప్పుడు ఎనలటిక్స్ ను సిద్ధం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా స్పందించిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్... ఒకే ఒక్క వాట్సప్ నెంబరుకు మెసేజ్ పంపించడం ద్వారా జనన, మరణ, కుల ధృవీకరణ పత్రాలు సహా అనేక సేవలు పొందొచ్చని.. ధృవీకరణ పత్రలను క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసుకునేందుకు అవకాశం ఉందని వివరించారు.
ఇదే సమయంలో... అన్ని ప్రభుత్వ సేవలూ ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్ సైట్ ద్వారా పొందొచ్చని.. ప్రస్తుతం ప్రపంచంలోని యూఏఈ (దుబాయ్) మాత్రమే ఒకే ఫ్లాట్ ఫామ్ పై అన్ని రకాల పౌరసేవలూ అందిస్తోందని.. ఇక దేశంలో మాత్రం ఏపీలోనే తొలిసారి ఇలాంటి సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు వెల్లడించారు.
అందించే సేవలు ఏవేవి అంటే..?:
ప్రభుత్వం ఏదైనా సమచారాన్ని (భారీ వర్షాలు, వరదలు, స్కూళ్లకు సెలవులు, విద్యుత్ సరఫరాలో అంతరాయం....) వాట్సప్ అకౌంట్ ద్వారా పంపిస్తుంది.
ప్రజలు తమ తమ వినతులు, ఫిర్యాదులు (రోడ్లపై గుంతలు, డ్రైనేజీ లీకేజీలు మొదలైనవి, అందని ప్రభుత్వ పథకాలు!... ) వంటివాటిని ఈ మెసేజ్ కు వాట్సప్ చేస్తే సరిపోతుంది.
ఇదే సమయంలో.. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారన్ని వాట్సప్ లో పంపిస్తారు. అందులో నుంచే ప్రాంతాల ఎంపిక, టిక్కెట్ల బుక్కింగ్, హోటల్స్ బుక్కింగ్ వంటివి చేసుకోవచ్చు.
ఇదే సమయంలో కరెంట్ బిల్లులు, ఆస్తిపన్నులు ఈ వాట్సప్ ద్వారా చెల్లించొచ్చు. ట్రెడ్ లైసెన్సులు పొందొచ్చు. ఇక దేవాలయాల దర్శనాల స్లాట్ బుక్కింగ్ లతో పాటు ఇక్కడ నుంచే విరాళాలు పంపొచ్చు!