Begin typing your search above and press return to search.

బాబుకు సవాల్...ఆదాయానికి దారేదీ ?

చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి అన్నీ ఆయన చేస్తారు సర్దుకుంటాయని సీనియర్లు మంత్రులు అంతా భారమేసి ఉన్నారు.

By:  Tupaki Desk   |   25 Dec 2024 3:33 AM GMT
బాబుకు సవాల్...ఆదాయానికి దారేదీ ?
X

ఏపీలో ఆదాయం పెరిగే మార్గాల కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి అన్నీ ఆయన చేస్తారు సర్దుకుంటాయని సీనియర్లు మంత్రులు అంతా భారమేసి ఉన్నారు. కానీ బాబు చేతిలో కూడా మంత్ర దండం అయితే లేదు. ఆయన కూడా అన్నీ చూసుకోవాల్సిందే

ఇదిలా ఉంటే బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు. ఇంకా అనేక వర్గాలు ఇచ్చారు. అన్నీ కలసి ఆయనకు అధికారాన్ని ఇచ్చాయి. పైగా సంపద సృష్టిస్తామని అన్నారు. అయితే ఏపీ వంటి రాష్ట్రానికి సంపద సృష్టించడం ఓవర్ నైట్ లో అయితే జరిగే పని కాదని అంటున్నారు

ఏపీకి రాజధాని అన్నది లేదు. ఏ రాష్ట్రం అయినా అధిక ఆదాయాన్ని తెచ్చుకునేది రాజధాని నుంచే. ఆ విషయంలో ఏపీ పదేళ్ళుగా నష్టపోతూనే ఉంది. ఇపుడు బాబు మళ్లీ సీఎం అయ్యారు కాబట్టి అమరావతి రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు

ఈ నిర్మాణం ఒక దశకు చేరుకునేందుకు మూడేళ్ళ కాలం పడుతుంది. అంటే 2027 కానీ 2028 కానీ అవ్వచ్చు. అప్పటికి సంపద సృష్టి అన్నది మెల్లగా సన్నని ధారగా మొదలు కావచ్చు. మరి అంతవరకూ ఏమి చేయాలన్నదే కూటమి సర్కార్ కి సవాల్ గా మారుతోంది.

ఏపీలో చూసుకుంటే మద్యం దుకాణాల ద్వారా కొంత ఆదాయం వస్తోంది కానీ అది ఉచిత గ్యాస్ పధకానికి వెళ్ళిపోతోంది. దానికి తోడు అన్నట్లుగా ఏకంగా మూడు వేల నుంచి నాలుగు వేలకు సామాజిక పెన్షన్ల మొత్తాన్ని పెంచారు. దాని వల్ల ఒకేసారి కూటమి ప్రభుత్వం మీద వేల కోట్ల భారం పడుతోంది.

ఇక ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రతీ నెలా ఒకటవ తేదీకల్లా జీతాలు పెన్షన్లు ఇస్తామని బాబు కీలక హామీ ఇచ్చారు. ఇపుడు దానిని కూడా నిలబెట్టుకోవాలి. అందుకోసం కూడా ప్రతీ నెలా చివరి పది రోజులూ ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకునేందుకు తీవ్ర కసరత్తు చేయాల్సి వస్తోంది అని అంటున్నారు.

ఇక సూపర్ సిక్స్ లోని కీలక హామీలు అన్నీ అలాగే ఉన్నాయి. వాటిని అమలు చేయాలీ అంటే ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం అయితే ఉండాలి. కానీ సర్కార్ కి ఆదాయ మార్గాలు అయితే తక్కువగానే ఉన్నాయి. దాంతో ఏమి చేయాలి అన్నది చంద్రబాబు లాంటి అనుభవశాలి కూడా ఆలోచించేలా ఉంది అని అంటున్నారు.

ప్రభుత్వానికి గతంతో పోలిస్తే ఆదాయం అయితే పెరిగింది. కానీ దానిని మించి ఖర్చులు కూడా పెరిగిపోయాయి. దీంతోనే ఇపుడు ఇబ్బందిగా మారుతోంది అని అంటున్నారు. ఖర్చులు తడిసి మోపెడు అయిపోతే వస్తున్న ఆదాయం ఏ మూలకూ సరిపోకపోగా ఎటు వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే ఏపీలో ఆదాయానికి దారేదీ అని కూటమి అన్వేషిస్తోంది.