పెట్టుబడుల క్రెడిట్‌పై పార్టీలు మౌనం.. రీజన్ ఇదే..!
ఇక, ఈ పెట్టుబడుల వ్యవహారంపై కూటమిలోని జనసేన, బీజేపీ నాయకులు మాత్రం మౌనంగా ఉన్నారు.
By: Tupaki Desk | 23 Jan 2025 11:56 AM GMTప్రస్తుతం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, మరో మంత్రి టీజీ భరత్‌లు స్విట్జర్లాండ్‌లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు వెళ్లారు. అక్కడ పెద్ద ఎత్తున పారిశ్రామిక వేత్తలను ఆకర్షించి.. ఏపీకి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ చర్చలు ఫలించి.. రాష్ట్రానికి.. పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయని వారు ఆశిస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో అబివృద్ది జరుగుతుందని.. ఇది తమకు మేలు చేస్తుందని కూడా లెక్కలు వేసుకుంటున్నారు.
ప్రభుత్వంలో ఉన్నా.. రాజకీయాలను వేరు చేసి చూసే పరిస్థితి లేదు. సో..దావోస్ సదస్సు ద్వారా వచ్చే పెట్టుబడులతో తమ పార్టీ పుంజుకుంటుందని టీడీపీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమకు మేలు జరుగుతుందని కొందరు అంటున్నారు. ఇంకొందరు మరో అడుగు ముందుకు వేసి.. ఇంకొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే.. ఇవన్నీ అంతర్గత సంభాషణలే. ఏమాత్రం పెద్ద నేతల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా.. ఈ వ్యాఖ్యలు మీడియా ముందుకు రానున్నాయి.
ఇక, ఈ పెట్టుబడుల వ్యవహారంపై కూటమిలోని జనసేన, బీజేపీ నాయకులు మాత్రం మౌనంగా ఉన్నారు. వారు దీనిపై పెద్దగా స్పందించడం లేదు. వాస్తవానికి.. దావోస్‌కు వెళ్తూ.. వెళ్తూ.. సీఎం చంద్రబాబు.. దీనిపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని, ప్రజలకు పెట్టుబడులపై వివరించాలని కూటమి పార్టీల మంత్రులకు, నాయకులకు పిలిచి మరీ చెప్పుకొచ్చారు. తద్వారా.. పెట్టుబడుల పై ప్రజల మధ్య చర్చ జరిగి.. ప్రభుత్వానికి గ్రాఫ్ పెరుగుతుందని కూడా అంచనా వేసుకున్నారు.
అందరూ అప్పట్లో ఓకే అన్నట్టుగా మీడియాలోనూ వార్తలు వచ్చాయి. కానీ, దావోస్ సదస్సుకు వెళ్లి మూడు రోజులు అయినా.. రాష్ట్రంలో ఒక్క కూటమి నాయకుడు కూడా దీనిపై చర్చించడం లేదు. మీడియా ముందుకు వచ్చి ఏం జరిగిందో ఇక నుంచి ఏం జరుగుతోందో కూడా చెప్పడం లేదు. దీనికి కారణం.. పెట్టుబడుల క్రెడిట్టేనన్నది విశ్లేషకుల అంచనా. పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా అందరికీ మేలు జరుగుతుందని చంద్రబాబు ఆలోచనగా ఉంది.
అయితే.. కూటమిలోని.. కొందరు మాత్రం తమకు ఎలాంటి క్రెడిట్ లేకుండా పోతుందని.. ఇప్పుడు తాము దీనిపై స్పందిస్తే.. అయాచితంగా టీడీపీకి మేలు చేసినట్టు అవుతుందని.. బీజేపీ నాయకులు, జనసేనలో ని కొందరు నేతలు ఆఫ్ ది రికార్డుగా మీడియామిత్రులకు చెప్పడం గమనార్హం. వాస్తవానికి ఇలాంటి ఆలోచన తప్పు అనేది విశ్లేషకుల అంచనా. అయితే..ఇక్కడ జరిగిన పొరపాటు కూడా ఉంది. కేవలం టీడీపీకి చెందిన వారినే చంద్రబాబు తనతో తీసుకువెళ్లారన్న ఆవేదన కూటమిలో ఉందని తెలుస్తోంది. మొత్తానికి మూడు రోజులు ముగిసినా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ తరహా ఊపు తెచ్చేందుకు కూటమి నాయకులు ట్రై చేయడం లేదు.