నో ఇంపాక్ట్... వైసీపీని లైట్ తీసుకున్న కూటమి
మొత్తానికి చూస్తే వైసీపీ తనకు తానే తగ్గి అసెంబ్లీకి వస్తే ఓకే కానీ ఇక మీదట ఎవరూ రావాలని కోరేదీ ఉండదు, పిలిచేది ఉండదని అంటున్నారు.
By: Tupaki Desk | 13 Nov 2024 6:40 AM GMTస్వయం కృతాపరాధం అని అందుకే అంటారు. ఎవరి ఆలోచనలతో వారే దెబ్బ తింటారు. రాజకీయాలలో చూస్తే కనుక నిర్ణయాలు చాలా ప్రభావితం చేస్తాయి. సమయానుకూలంగా ఎప్పటికపుడు తమ డెసిషన్లు ఉండాలి. వాటిని జనంతో కనెక్ట్ అయ్యేలా చూసుకోవాలి. ఏ డెసిషన్ తీసుకున్నా నేనూ నా ఇష్టం అనుకోవచ్చు.
కానీ రాజకీయాలలో అలా కుదరదు, అది జనంతో కనెక్ట్ అయి ఉంటుంది. వారి పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఆలోచించి సర్వ సమగ్రంగా డెసిషన్ ఉండాలి. ఒక వేళ తప్పు చేసినా అది ఒప్పు అని జనం అనుకునేలా ఉండాలి. వైసీపీ విషయానికి వస్తే అసెంబ్లీని బాయ్ కాట్ చేయడం అన్నది పూర్తిగా అధినేత జగన్ నిర్ణయంగానే అంతా చూస్తున్నారు.
ఆ పార్టీలో జగన్ కాకుండా పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో కూడా భిన్న వాదనలు ఉన్నాయన్న మాట ఉంది. మరో వైపు చూస్తే అసెంబ్లీకి రాకపోవడం అన్న దాంటో సరైన పాయింట్ అయితే వైసీపీ జనం ముందు ఉంచలేకపోతోంది. మైకు ఇవ్వరు అన్నది ఒక్కటే పాయింట్ గా చెబుతోంది. సభకు వస్తే కదా మైకు ఇచ్చేదో లేదో తెలుస్తుంది అన్నది జనాంతికమైన మాట.
ఇక ప్రతిపక్ష హోదా కావాలి అని వైసీపీ అడగడం కూడా బూమరాంగ్ అవుతోంది. పదవులు హోదాలు ఉంటేనే తప్ప సభకు వెళ్లరా అన్న అర్ధాలు కూడా జనంలోకి పోయేలా ఉన్నాయి. ఏపీలో కూటమి తొలి బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాటి విషయంలో చర్చించి సభలో ప్రభుత్వాన్ని ఎండగట్టే చాన్స్ అయితే వైసీపీ పోగొట్టుకుంది అనే అంటున్నారు.
ఇక వైసీపీ సభకు అటెండ్ కాలేదు అన్న దాని మీద ఒకరిద్దరు మంత్రులు కొద్దిగా రియాక్ట్ అయ్యారు తప్ప ఆ మీదట వదిలేశారు. కాంగ్రెస్ చీఫ్ షర్మిల మాత్రమే దాని గురించి గట్టిగా రెట్టిస్తోంది. టీడీపీ కూటమి పెద్దలు అయితే వైసీపీ సభకు రాకపోవడాన్ని అసలు పట్టించుకోవద్దు అన్నట్లుగానే ఉన్నారని అంటున్నారు.
ఎమ్మెల్యేలకు అవగాహనా సదస్సుని నిర్వహించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సభలో ప్రతిపక్షం లేదని అనుకోవద్దు, మనకు మనమే ప్రజలకు జవాబు దారీగా పనిచేద్దామని చెప్పారు. అంతే కాదు ప్రజలకు ఏది అవసరమో దానిని గురించి ప్రతీ శాసనసభ్యుడూ సభలో మాట్లాడాలని ఆయన కోరారు.
ఇక ప్రతిపక్షం సభకు రావడం లేదు అన్న దానిని ఒక్క మాటలో తేల్చేశారు. వారికి బాధ్యత లేదని బాబు చెప్పడం బట్టి చూస్తే రేపటి రోజున ఏ సందర్భంలో అయినా వైసీపీని ఈ విధంగానే కార్నర్ చేయడానికి టీడీపీ కూటమి నిర్ణయించిందని అంటున్నారు.
ఇక అసెంబ్లీలో మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారితోనే సభ మొత్తం నిండిపోతోంది. ఇక ప్రజా సమస్యల మీద మేము ప్రశ్నిస్తామని బీజేపీ అంటోంది.జనసేన టీడీపీ నుంచి కూడా పలువురు ఎమ్మెల్యేలు ప్రజా సమయ్సల మీద గళం విప్పడానికి రెడీ అవుతున్నారు. దాంతో సభలో సరైన ప్రశ్నలు రావాలే కానీ అర్ధవంతమైన చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే ఒకటి రెండు రోజులు మాత్రమే వైసీపీ సభకు హాజరు కాలేదని అంతా అనుకునే పరిస్థితి ఉంది. ఇపుడు మెల్లగా సభ అంటే ఆ మూడు పార్టీలదే అన్నది అర్ధం అవుతున్న వేళ వైసీపీ బాయ్ కాట్ ని జనాలు మరచిపోయే పరిస్థితి ఉంది. మొత్తానికి చూస్తే సభకు వైసీపీ గైర్ హాజరు వల్ల ఏ రకమైన ఇంపాక్ట్ అన్నది పడడం లేదని కూడా అంటున్నారు.
ఇక అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే ప్రతిపక్ష హోదా మీద ప్రభుత్వం ఆలోచిస్తుందా అంటే అది అతి పెద్ద డౌట్. ఆ విధంగా ప్రభుత్వాన్ని ఒత్తిడి అయితే చేయలేరు, మరో వైపు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయమని స్పీకర్ సెక్రటరీని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. నాలుగు వారాలు గడువు ఇచ్చింది. ఇది ఒక ప్రాసెస్ గా నడుస్తుంది.
ఈ విషయంలో స్పీకర్ ఆఫీస్ తన విచక్షణతో పనిచేస్తుంది కాబట్టి ఎవరూ ఎవరినీ అక్కడ ఆదేశించలేని పరిస్థితి. మొత్తానికి చూస్తే వైసీపీ తనకు తానే తగ్గి అసెంబ్లీకి వస్తే ఓకే కానీ ఇక మీదట ఎవరూ రావాలని కోరేదీ ఉండదు, పిలిచేది ఉండదని అంటున్నారు. సో వైసీపీ తానుగా పొలిటికల్ గా ఐసోలేట్ అయ్యే డెసిషన్ గానే దీనిని విశ్లేషిస్తున్నారు.