Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రా భూ కబ్జాల మీద కూటమి ఫోకస్ ?

అయిదేళ్ల పాటు వైసీపీ నేతలు కొంతమంది విచ్చలవిడిగా భూ దందాలకు పాల్పడ్డారని ప్రభుత్వ ప్రైవేటు భూములను టార్గెట్ చేశారు అని ప్రాథమిక నివేదికలు ప్రభుత్వానికి అందాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   3 July 2024 3:15 AM GMT
ఉత్తరాంధ్రా భూ కబ్జాల మీద కూటమి ఫోకస్ ?
X

ఉత్తరాంధ్రాలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు గడచిన అయిదేళ్ళ వైసీపీ పాలనలో చోటు చేసుకున్నాయని కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి భావిస్తోంది. దీని మీద పూర్తి స్థాయిలో ఒక సమగ్రమైన విచారణ జరిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయిదేళ్ల పాటు వైసీపీ నేతలు కొంతమంది విచ్చలవిడిగా భూ దందాలకు పాల్పడ్డారని ప్రభుత్వ ప్రైవేటు భూములను టార్గెట్ చేశారు అని ప్రాథమిక నివేదికలు ప్రభుత్వానికి అందాయని అంటున్నారు.

అసైన్డ్ ల్యాండ్ లని సైతం తమ పేర రాయించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు చాలా మంది ప్రైవేట్ వ్యక్తులను బెదిరించారని ఆ విధంగా కూడా భూముల భాగోతం సాగిందని చెబుతున్నారు. విశాఖ నుంచి శ్రీకాకుళం దాకా చూస్తే దాదాపుగా ముప్పయి నుంచి నలభై వేల ఎకరాల దాకా భూ కబ్జాలు సాగినట్లుగా ప్రభుత్వానికి నివేదికలు అందినట్లుగా చెబుతున్నారు.

గతంలో వైసీపీ ప్రభుత్వంలో రెవిన్యూ మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు కూడా భూ దందాల మీద బాహాటంగానే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆఖరుకు శ్రీకాకుళం దాకా కూడా భూ కబ్జా దారులు వచ్చారని కూడా ఆయన అన్నట్లుగా అప్పట్లో ప్రచారం సాగింది. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రాలో భూ కబ్జాలు భారీగా పెరిగాయని గత అయిదేళ్ళుగా అప్పటి విపక్షం అయిన టీడీపీ జనసేన ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

మరో వైపు చూస్తే విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వైసీపీ నేత జీవీల మీద నాన్ బెయిల్ బుల్ అరెస్ట్ వారెంటులు కూడా పలు కేసులలో పోలీస్ స్టేషనలో నమోదు అయ్యాయి. భూ వివాదాల మీదనే మాజీ ఎంపీ మీద కేసులు పెడుతున్నారు. ఇక గతంలో విశాఖలో వైసీపీ ఒక పెద్ద తలకాయ పార్టీ బాధ్యతలు చూస్తూ భూ దందాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా గత ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పనిచేసిన ఒకాయన కూడా ఈ భూ కబ్జాల భాగోతంలో చిక్కుకున్నారు అని అంటున్నారు.

దాంతో మొత్తం వ్యవహారాలన్నింటి మీద చాలా తొందరలోనే ఒక విచారణ కమిటీని నియమించి నిగ్గు తేలుస్తారు అని అంటున్నారు. ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని అంటున్నారు. భూ కబ్జాల విషయంలో చూస్తూ ఊరుకోమని తగిన చర్యలు ఉంటాయని కూటమి నేతలు హెచ్చరిస్తున్నారు.

వేలాది ఎకరాలు ఎన్నడూ లేని విధంగా కబ్జా కావడం అంటే ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అని అంటున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు అయినా కాక ముందే ఉత్తరాంధ్ర భూ దందాను తేల్చే పనిలో ఫుల్ బిజీగా ఉంది అని అంటున్నారు. దాంతో ఈ దందాలలో కీలక పాత్ర పోషించిన వైసీపీ నేతల గుండెలలో రైళ్ళు పరిగెడుతున్నాయని అంటున్నారు.