Begin typing your search above and press return to search.

మాజీలకు పొత్తు షాకులు...!

అలా శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రులు కిమిడి కళా వెంకటరావు కుటుంబం ఆశిస్తున్న ఎచ్చెర్ల సీటుని జనసేనకు కేటాయించాలని అనుకుంటున్నారుట.

By:  Tupaki Desk   |   31 Jan 2024 3:49 AM GMT
మాజీలకు పొత్తు షాకులు...!
X

తెలుగుదేశం పార్టీ మాజీలను తప్పుకోమంటోందా. దానికి పొత్తులు సాకుగా చూపిస్తోందా అంటే జవాబు మాత్రం అదే వస్తోంది. కొన్ని సీట్లలో జనసేనకు సీట్లు కచ్చితంగా ఇవ్వడానికి టీడీపీ చూస్తోంది అని అంటున్నారు. అలా శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రులు కిమిడి కళా వెంకటరావు కుటుంబం ఆశిస్తున్న ఎచ్చెర్ల సీటుని జనసేనకు కేటాయించాలని అనుకుంటున్నారుట.

ఎచ్చెర్ల వద్ద గతంలో పవన్ కళ్యాణ్ యువ గర్జన సభను నిర్వహించారు. అప్పటి నుంచి జనసేనకు ఈ సీటు మీద కన్ను ఉంది అని అంటున్నారు. అంతే కాదు ఇక్కడ టీడీపీలో వర్గ పోరు ఉంది. కళాకు టికెట్ ఇస్తే కలిశెట్టి అప్పలనాయుడు వర్గం వ్యతిరేకిస్తుంది. కలిశెట్టికి టికెట్ ఇస్తే కళా వర్గం పనిచేయదు. దాంతో జనసేనకే ఈ టికెట్ అని ఒక సమస్యని అలా పరిష్కరించాలని టీడీపీ చూస్తోందిట.

అలాగే పలాస టికెట్ విషయంలోనూ మాజీ మంత్రి గౌతు శ్యామ సుందర శివాజీ కుటుంబానికి కూడా భారీ షాక్ తగలబోతోంది అని అంటున్నారు. ఆయన తన కుమార్తె గౌతు శిరీషకు టికెట్ ఇప్పించుకోవాలని చూస్తున్నారు. ఆమెకు 2019లో తొలిసారిగా టికెట్ ఇస్తే ప్రస్తుతం మంత్రిగా ఉన్న సీదరి అప్పలరాజు చేతిలో ఓటమి పాలు అయ్యారు. గత ఐదేళ్లలో పెద్దగా గ్రాఫ్ పెరిగింది లేదు, పైగా వర్గ పోరు ఉంది. దాంతో పాటు జనసేన ఈ సీటు కోరుతోంది అని అంటున్నారు.

ఇక పాతపట్నం సీటు విషయం అలాగే ఉంది. ఇక్కడ దశాబ్దాల బట్టి కలమట కుటుంబానికే టికెట్ ఇస్తూ వస్తోంది టీడీపీ. ఇక లేటెస్ట్ గా చూస్తే మామిడి గోవిందరావు అనే మరో నేత ఈ సీటు కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు. ఆయన టికెట్ ఆశిస్తూ పార్టీ పెద్దలను కలుస్తున్నారు. ఇక్కడ కలమట వర్సెస్ మామిడి అన్నట్లుగా భీకర వర్గ పోరు సాగుతోంది. దీంతో ఈ సీటుని కూడా జనసేనకు ఇస్తున్నారు అని అంటున్నారు.

అలాగే విజయనగరంలో చూసుకుంటే నెల్లిమర్ల సీటు విషయంలో మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి కుటుంబం తమకు కావాలని అంటోంది. అయితే ఇక్కడ కర్రోతు బంగారరాజుని ఇంచార్జిగా పెట్టినా వర్గ పోరు బాగా పెరిగిపోయింది. ఇలా ఈ రెండు వర్గాలలో ఎవరికి సీటు ఇచ్చినా సైకిల్ ని కిల్ చేస్తారు అని అధినాయకత్వం భావిస్తోంది. ఈ సీటుని జనసేనకు ఇస్తోందని ప్రచారం సాగుతోంది.

గజపతినగరంలో అదే కధ ఉంది. ఇక్కడ కూడా మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు వర్సెస్ ఆశావహులు గా ఉంది. దాంతో ఈ సీటుని జనసేన కోరుతోందని ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. రాజాం సీటు మాజీ మంత్రి కూడా కోండ్రు మురళీ మురళీ మోహనరావుకు ఇస్తే ఊరుకోమని కళా వర్గం అంటోంది.అలాగే మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె ఈ సీటు కోసం ట్రై చేస్తున్నారు. దాంతో ఇది కూడా జనసేనకు దక్కే చాన్స్ ఉంది అని అంటున్నారు.

ఇక విశాఖలో కూడా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సీటు పెందుర్తి జనసేనకు వెళ్తోంది. అలాగే మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సిట్టింగ్ సీటు ఉత్తరం కూడా జనసేనకు ఇస్తారని టాక్ నడుస్తోంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడి కోసం కోరిన అనకాపల్లి ఎంపీ సీటు కూడా పొత్తు పేరిట జనసేనకు ఇచ్చేస్తున్నారని వినిపిస్తోంది. ఇలా చాలా మంది మాజీల ఆశలకు పొత్తుతో చెక్ పెట్టేస్తున్నారు అని అంటున్నారు.