మెగా ఫ్యామిలీతో పొత్తు : మాస్టర్ ప్లాన్ లో బీజేపీ...!?
మెగాస్టార్ చిరంజీవికి 75వ గణతంత్ర వేడుకల వేళ దేశంలో రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం
By: Tupaki Desk | 26 Jan 2024 3:24 PM GMTమెగాస్టార్ ఫ్యామిలీ అంటే తెలుగు రాష్ట్రాలలో ఎంతో అభిమానం ఉంది. అంతే కాదు ఆ ఫ్యామిలీలో దాదాపుగా అరడజను కి మించి హీరోలు ఉన్నారు. పైగా బలమైన సామాజిక వర్గానికి చెందిన మెగా ఫ్యామిలీ అండ ఉంటే తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల గోదావరిని ఈదేయవచ్చు అన్నది కమల నాధుల మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవికి 75వ గణతంత్ర వేడుకల వేళ దేశంలో రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ పురస్కారానికి మెగాస్టార్ నూరు పాళ్ళూ అర్హుడే. అందులో రెండవ మాటకు తావు లేదు. కానీ ప్రకటించిన సమయం సందర్భం బట్టే రాజకీయ విశ్లేషణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.
దీనికి వెనకటి ఉదాహరణలు కూడా గుర్తు చేస్తున్నారు. సరిగ్గా తమిళనాడు ఎన్నికల ముందు అక్కడి సూపర్ స్టార్ రజనీకాంత్ కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని ప్రకటించి బీజేపీ ఆయన్ని తిప్పుకోవాలని చూసింది. అయితే ఆ తరువాత రజనీ రాజకీయాలకు దూరం అని చెప్పేశారు. కానీ ఏపీలో అలా కాదు మెగాస్టార్ తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు.
ఆయన బీజేపీతో పొత్తులో కూడా ఉన్నారు. ఇపుడు చిరంజీవికి పద్మ పురస్కారం ప్రకటించడం ద్వారా మెగా ఫ్యామిలీని మరింత దగ్గరగా చేసుకుని వచ్చే ఎన్నికల్లో గణనీయంగా రాజకీయ లాభాన్ని పొందాలన్న బీజేపీ ఎత్తుగడ ఉంది అని ప్రచారం అయితే సాగుతోంది. చిరంజీవి విషయానికి వస్తే ఆయన రాజకీయాలకు గుడ్ బై కొట్టి చాలా సంవత్సరాలు అయింది.
అయితే ఆయన సినిమాల్లో నటిస్తూ మెగా స్టార్ గానే ఉన్నారు. ఆయనకు భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో ఆయన డైరెక్ట్ గా రాజకీయాల్లోకి రాకపోయినా ఆయన అభిమాన గణం, ఆయన సామాజిక వర్గం తమ వెంట ఉంటుందన్న ఆశలతో బీజేపీ ఈ విధంగా పావులు కదిపింది అని అంటున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఆయనతో కలసి వచ్చే ఎన్నికలలో కూటమిగా వెళ్ళాలన్నది కూడా బీజేపీ ప్లాన్. ఇపుడు మెగా స్టార్ కి అత్యున్నత పురస్కారం ప్రకటించిన తరువాత సహజంగానే పవన్ మీద ఆ ప్రభావం ఉంటుంది. ఆయన బీజేపీతో కలసి నడిచేందుకు టీడీపీని వీడేందుకు కూడా ఒక అవకాశంగా కూడా దీన్ని చూస్తున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో బీజేపీ మాత్రం కొత్త ఎత్తులతోనే వస్తోంది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కనుక తమ వైపు ఉంటే కాపులను సీఎం గా చేస్తామని చెప్పి ఏపీ పాలిటిక్స్ లో తన వ్యూహాన్ని ముందుకు పెట్టి నడవాలని అనుకుంటోంది. అయితే బీజేపీ ఆలోచనలు ఎలా ఉన్నా పవన్ ఆ పార్టీతో కలసి నడిస్తేనే ఇవన్నీ సాకారం అవుతాయని అంటున్నారు.
అదే విధంగా ఏపీ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ ని సీఎం గా చూడాలని అతి పెద్ద సామాజిక వర్గం ఆశిస్తోంది. బీజేపీ జనసేన కూటమిగా ముందుకు వచ్చి పోటీ చేస్తే ఏపీలో హంగ్ అసెంబ్లీ ఏర్పడినా ఏర్పడవచ్చు అన్నది ఒక విశ్లేషణ. అదే జరిగితే పవన్ కి సీఎం చాన్స్ కచ్చితంగా వస్తుందని, అది కాపులకు మేలు చేసేదిగా ఉంటుందని అంటున్నారు. దాంతో కాపు పెద్దలు కూడా ఇపుడు బీజేపీ ఆలోచనతో ఏకీభవిస్తారు అని అంటున్నారు.
బీజేపీ జనసేన కూటమి అయితే ముద్రగడ పద్మనాభం వంటి వారు కూడా ముందుకు వచ్చి గట్టిగా ప్రచారం చేస్తారు అని అంటున్నారు. ఇక మెగాస్టార్ కాకపోయినా మెగా హీరోలు కూడా ఈ కూటమి తరఫున ఏపీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించే చాన్స్ ఉందని అంటున్నారు. మరి బీజేపీ ఆలోచనలు సాకారం అవుతాయా లేదా అన్నది వేచి చూడాల్సిందే.