Begin typing your search above and press return to search.

నయా ట్రెండ్‌.. అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలకు కూడా ‘ఉచితాలు’

ఎన్నికల్లో గెలవడానికి అన్ని పార్టీలు ‘ఉచితాలు’ పైనే ఆధారపడ్డాయి. తాము అధికారంలోకి వస్తే ఉచిత పథకాలను అందిస్తామని ఇబ్బడిముబ్బడిగా హామీలిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   18 Nov 2023 4:31 AM GMT
నయా ట్రెండ్‌.. అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలకు కూడా ‘ఉచితాలు’
X

ఎన్నికల్లో గెలవడానికి అన్ని పార్టీలు ‘ఉచితాలు’ పైనే ఆధారపడ్డాయి. తాము అధికారంలోకి వస్తే ఉచిత పథకాలను అందిస్తామని ఇబ్బడిముబ్బడిగా హామీలిస్తున్నాయి. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు తమను ఎన్నికల్లో గెలిపించేవి ఉచిత పథకాలేనని గట్టిగా నమ్ముతున్నాయి. ఆకర్షణీయ పథకాలతో మేనిఫెస్టోలు విడుదల చేసి ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో అధికార పార్టీ ప్రతిపక్షాలు ఇస్తున్న ఉచిత హామీలను, పథకాలను నమ్మొద్దని ప్రజలను కోరుతోంది. నమ్మితే మోసపోతారని అధికార పార్టీ చెబుతోంది. అధికార పార్టీ ఉచిత పథకాలతో రాష్ట్రాన్ని దెబ్బతీసిందని, దీనివల్ల రాష్ట్రం కుదేలయిందని, అప్పుల్లో మునిగిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే తాము అధికారంలోకి వస్తే ఇంకా మెరుగ్గా మరిన్ని పథకాలను అందిస్తామని ప్రతిపక్షాలు చెబుతుండటం కొసమెరుపు.

కాగా ఈ పార్టీల ఉచిత పథకాలు సామాన్య ప్రజలకు, పేద, దారిద్య్ర రేఖకు దిగువ నున్న వర్గాలకే పరిమితం కావడం లేదు. ధనికులు, ఎగువ మధ్యతరగతి వర్గాలు నివసించే గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్టమెంట్లకు కూడా విస్తరించాయి. అపార్టుమెంట్లను, గేటెడ్‌ కమ్యూనిటీలను కూడా వదలకుండా ఆయా పార్టీల అభ్యర్థులు జల్లెడపతున్నారు.

ఈ క్రమంలో గేటెడ్‌ కమ్యూనిటీల్లో, అపార్టుమెంట్లలో నివసించేవారికి సైతం అభ్యర్థులు పలు ఉచిత హామీలిస్తున్నారు. తమకు ఓట్లు వేయాలని, తమకు ఓట్లేస్తే అపార్టుమెంట్లలో సీసీ కెమెరాల ఏర్పాటు, జనరేటర్ల ఏర్పాటు చేపడతామని చెబుతున్నారు. మరికొంతమంది అభ్యర్థులు ఇంకో అడుగు ముందుకేసి సోలార్‌ పవర్‌ ఎనర్జీ (సౌర విద్యుత్‌) ని సైతం గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లలో ఏర్పాటు చేస్తామని ఉచిత హామీలు ఇస్తున్నారు. తద్వారా గేటెడ్‌ కమ్యూనిటీ వాసులను, అపార్టుమెంట్‌ వాసులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు బాగా చదువుకున్నవారు, మంచి ఉద్యోగాలు చేసేవారు నివసించే గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్టుమెంట్ల నివాసులు సైతం ఈ ఉచిత పథకాలు, హామీలవైపు మొగ్గు చూపుతున్నారు. అభ్యర్థుల ఇస్తున్న ‘ఆఫర్ల’ ను వద్దనుకుండా మరికొన్ని ఉచిత కోరికలు కోరుతుండటం కొసమెరుపు.

నవంబర్‌ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వివిధ పార్టీల అభ్యర్థులు వివిధ నగరాల్లోని గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌ మెంట్‌ కాంప్లెక్స్‌లను సందర్శించడం ప్రారంభించారు. గేటెడ్‌ కమ్యూనిటీల ప్రతినిధులు, అపార్టుమెంట్ల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే వారికి పలు హామీలిస్తున్నారు. ఉచిత పథకాలతో ఆకట్టుకోవాలని చూస్తున్నారు.