Begin typing your search above and press return to search.

కాబోయే సీఎం కోసం రేసులో నలుగురు

జగన్ సైతం టీడీపీ దాడులు చేయిస్తోందని అధికారం మీకు శాశ్వతం అనుకుంటే పొరపాటు అని హెచ్చరిస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 July 2024 3:00 AM GMT
కాబోయే సీఎం కోసం రేసులో నలుగురు
X

నిన్ననే 2024 ఎన్నికల కురుక్షేత్రం ముగిసింది. ఇంకా బిగిసి అయిదేళ్ళు ఉన్నాయి. అయినా అపుడే 2029 అని అంతా అంటున్నారు. ఓడిపోయిన పార్టీలకు ఎన్నికలు మళ్లీ ఎంత త్వరగా వస్తే బాగుండు అని అనిపిస్తుంది. వైసీపీ అయితే అదే ఊపులో ఉంది. ఈసారి మేము పక్కాగా గెలుస్తామని ఓడిన రోజు నుంచే చెబుతోంది.

జగన్ సైతం టీడీపీ దాడులు చేయిస్తోందని అధికారం మీకు శాశ్వతం అనుకుంటే పొరపాటు అని హెచ్చరిస్తున్నారు. ఇక వైసీపీ తీరు ఇలా ఉంటే కాంగ్రెస్ కూడా రేసులోకి దూకేసింది. వైఎస్ షర్మిలను ఏపీ సీఎం అని ఏపీకి వచ్చినపుడల్లా రేవంత్ రెడ్డి ఒకటికి పది సార్లు చెబుతున్నారు.

ఆ మధ్యన ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను మద్దతుగా నిర్వహించిన సభలో కూడా షర్మిల కాబోయే సీఎం అన్నారు. వైఎస్సార్ జయంతి వేడుకలలో కూడా మళ్ళీ అదే మాట అన్నారు. అలా ఆయన అన్నప్పుడల్లా వైఎస్ షర్మిల చిరు నవ్వుతో ఆ మాటలను ఆస్వాదిస్తున్నారు.

చిత్రమేంటి అంటే ఆమె ఈ రోజున ఎక్కడా గెలిచి తన సత్తా చాటుకోలేదు. ఆమె కడపలో పోటీ చేస్తే ఓట్ల శాతం బాగా తక్కువగా వచ్చింది.ఆమె ముందు ఎమ్మెల్యేగా గెలవాలి. తన నాయకత్వాన్ని జనంలో నిరూపించుకోవాలి. అపుడు కదా సీఎం ముచ్చట అన్న వారూ ఉన్నారు.

జగన్ సీఎం అని వైఎస్సార్ మరణం తరువాత కాంగ్రెస్ లో కొందరు అన్న నాటికి ఆయన ఎంపీగా గెలిచి ఉన్నారు. ఇక జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కూడా గెలిచి తన సత్తా చూపించారు. అలాగే ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. ఇలా గెలిచిన వారి విషయంలో సీఎం అంటే చెల్లుతుంది కానీ షర్మిలను ఊరకే సీఎం అంటే ఎలా అన్న వారూ ఉన్నారు. సరే కాంగ్రెస్ పార్టీ ఏపీలో గెలిస్తే షర్మిలే సీఎం అని అనుకోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదు అని అనుకున్నా ఏపీ సీఎం సీటు ఖాళీగా ఉందా అన్న చర్చ సాగుతోంది.

ఈ రోజుకు టీడీపీ కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. చంద్రబాబు శక్తిమంతుడైన సీఎం గా ఉన్నారు. ఇక టీడీపీలో భావి వారసుడు నారా లోకేష్ సీఎం కావాలని చూస్తున్నారు. ఆయన గతంలో రెండేళ్ళ పాటు మంత్రిగా పనిచేశారు. ఇపుడు మళ్లీ మంత్రిగా బాబు కేబినెట్ లో చేరారు. బాబు తరువాత లోకేష్ సీఎం ఆ పార్టీ వారు గట్టిగా నమ్ముతున్నారు. 2029లోనూ టీడీపీ విజయం తధ్యమని కూడా అంటున్నారు. సో కాబోయే సీఎం ఎవరు అంటే లోకేష్ అన్నది టీడీపీ మాట.

ఇక జనసేన నుంచి చూస్తే సీఎం అంటే పవన్ కళ్యాణ్ అని అంటున్నారు. ఆయన ఇపుడు ఉప ముఖ్యమంత్రి. సీఎం పదవికి అడుగు దూరంలో ఉన్నారు అని కూడా ఆయన అభిమానులు సంబరంగా చెబుతున్నారు. 2029లో ఆరు నూరు అయినా పవన్ సీఎం కావాల్సిందే అని కూడా వారు బల్ల గుద్దుతున్నారు. అలా అనుకుంటే కనుక 2029 నాటికి ఏపీ సీఎం గా పవన్ తప్ప మరోకరికి చాన్సే లేదు అని అంటున్నారు.

ఇక 2029లో సీఎం సీటుకు రేసులో ఉన్న వారు జగన్ షర్మిల, పవన్ నారా లోకేష్ అని చెప్పాల్సి ఉంటుంది. ఈ నలుగురూ కాబోయే సీఎంలుగా ఈ రోజు నుంచే ఉన్నారు. మరి జనాలు ఎవరికి పట్టం కడతారో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఇంకా ఓటేసిన వేలికి సిరా గుర్తు ఆరలేదు కానీ 2029 సీఎం పదవి గురించి ఆలోచిస్తున్నారు అంటే వామ్మో పాలిటిక్స్ అని అనుకోవాల్సిందే.