శ్రీతేజ్ ఆస్పత్రికి అల్లు అరవింద్... అల్లు అర్జున్ వెళ్లనిది అందుకే!
ఈ సందర్భంగా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్న అల్లు అరవింద్.. అతని కుటుంబ సభ్యులతో మాట్లాడి.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
By: Tupaki Desk | 18 Dec 2024 2:30 PM GMT"పుష్ప-2" ప్రీమియర్ షో వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అరవింద్ పరామర్శించారు. డిసెంబర్ 4న రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు రెండు వారాలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ క్రమంలో ఆ తొమ్మిదేళ్ల బాలుడు బ్రెయిన్ డ్యామేజ్ తో ఇబ్బంది పడుతున్నాడని.. కోలుకునేందుకు సమయం పడుతుందని వైద్యులు చెప్పారని హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అరవింద్ పరామర్శించారు.
ఈ సందర్భంగా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్న అల్లు అరవింద్.. అతని కుటుంబ సభ్యులతో మాట్లాడి.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో.. రేవతి కుటుంబాన్ని ఆదుకుంటామని అల్లు అరవింద్ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు పూర్తి సహకారం అదించిందని వెల్లడించారు!
మరోపక్క... న్యాయవాదుల సలహా మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అర్జున్ పరామర్శించ లేకపోయారని.. అందుకే ఆయన తరుపున తాను పరామర్శించినట్లు చెప్పారు!
ఇదే సమయంలో శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగానే ఉందని కిమ్ స్ వైద్యులు మంగళవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. శ్రీతేజ్ ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ పైనే ఉన్నాడని.. మెదడుకు ఆక్సిజన్ సరిగా అందటం లేదని.. బాలుడిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు. ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామని అన్నారు.