Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ అరెస్ట్... నిరాశలో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ శ్రేణులు!

ప్రైమ్ న్యూస్ లో టాప్ స్టోరీ అవుతామని ఆయా పార్టీలు భావించి ఉండొచ్చు! కానీ... ఆ ఆలోచనను, ఆశలను అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ కమ్మేసిందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   14 Dec 2024 12:12 PM GMT
అల్లు అర్జున్ అరెస్ట్... నిరాశలో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ శ్రేణులు!
X

అల్లు అర్జున్ అరెస్ట్, తదనంతర పరిణామాలు దేశవ్యాప్తంగా.. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మరోపక్క ఈ అరెస్ట్ పేరు చెప్పి రేవంత్ సర్కార్ ను బీఆరెస్స్ శ్రేణులు తప్పుబట్టాయి. మరోవైపు ఏపీ ప్రతిపక్ష నేత జగన్.. అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. అయితే.. ఆ రోజు కీలకమైన విషయాలు మీడియాలో కనుమరుగైపోయాయనే చెప్పాలి!

అవును... డిసెంబర్ 13వ తేదీ మూడు రాజకీయ పార్టీలకు అత్యంత కీలకమైన రోజనే చెప్పాలి. దీంతో... మీడియా కాన్సంట్రేషన్ మొత్తం తమపైనే ఉంటుందని.. తామే బ్యానర్ ఐటమ్స్ అవుతామని.. ప్రైమ్ న్యూస్ లో టాప్ స్టోరీ అవుతామని ఆయా పార్టీలు భావించి ఉండొచ్చు! కానీ... ఆ ఆలోచనను, ఆశలను అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ కమ్మేసిందని అంటున్నారు.

ఇందులో ప్రధానంగా... ఏపీలో తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన విజన్ @ 2047 డాక్యుమెట్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆరోజే ప్లాన్ చేశారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారని అంటున్నారు. అయితే... ఈ విషయంలో ఆ పార్టీ అనుకూల మీడియాగా ముద్రపడిన ఛానల్స్ లో కూడా అల్లు అర్జున్ అరెస్ట్ ఏపీసోడ్ లో కీలకంగా మారాయని అంటున్నారు.

దీంతో... టీడీపీ శ్రేణులు తీవ్ర నిరాశ చెందాయని.. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంపై మీడియా ఫోకస్ లేకుండా పోయిందని.. సోషల్ మీడియా చర్చనూ వైరల్ చేయలేకపోయామని ఫీలవుతున్నట్లు చెబుతున్నారు!

మరోపక్క... ఏపీలో అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీగా మారిన తర్వాత వైసీపీ ఓ కీలక కార్యక్రమాన్ని తలపెట్టింది. ఇందులో భాగంగా... కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలతో పాటు రైతులు మోసపోయారని, ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ జగన్ రైతు పోరు బాట ఉద్యమానికి పిలుపునిచ్చారు. అది కూడా అదే రోజు!

దీంతో... రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చారు.. రైతుల తరుపున పెద్ద ఎత్తున ఉద్యమించినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో పలు అరెస్టులు అయ్యాయని అంటున్నారు! అయితే.. అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్.. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ తొలి పిలుపును మీడియాలో తొక్కేసిందని అంటున్నారు!

అయితే... అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించడం.. అరెస్టును ఖండించడంతో కాస్త చర్చ జరిగిందని అంటున్నారు. మరోవైపు.. అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు ఈ సమయంలో మీడియాలో హైలెట్ అయ్యారు.

ఇక మూడో విషయానికొస్తే... కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ పార్లమెంట్ లో చేసిన తొలి ప్రసంగం అదే రోజు జరిగింది. ఎంపీగా లోక్ సభలో ప్రియాంక గాంధీ తొలి ప్రసంగం జాతీయ స్థాయిలో బ్యానర్ అవుతుందని కాంగ్రెస్ నేతలు భావించారని అంటున్నారు. అయితే.. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో అదీ మిస్సయ్యిందని చెబుతున్నారు.

ఇలా మీడియాలో ప్రచారం పరంగా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలకు డ్యామేజ్ తగలగా... అల్లు అర్జున్ అరెస్ట్ ఎఫెక్ట్ రాజకీయంగా ప్రత్యక్షంగా తెలంగాణలో కాంగ్రెస్ పైనా.. పరోక్షంగా ఏపీలో "మరో" పార్టీపైనా, నాయకులపైనా పుష్కలంగా పడిందని అంటున్నారు!