ఎఫ్.ఐ.ఆర్. లో ఏముంది?... అల్లు అర్జున్ కి రిమాండ్ తప్పదా..?
అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీన సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై నమోదైన కేసుకు సంబంధించి బన్నీని అదుపులోకి తీసుకున్నారు!
By: Tupaki Desk | 13 Dec 2024 8:02 AM GMTపుష్ప-2 సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్ ని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఆయనను ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు చిక్కడపల్లి స్టేషన్ కు తరలించారు. దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. మరోవైపు అరెస్ట్ అనంతరం స్టేషన్ బెయిల్ దొరుకుతుందా.. రిమాండ్ కు తరలిస్తారా అనేది ఆసక్తిగా మారింది.
అవును.. అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీన సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై నమోదైన కేసుకు సంబంధించి బన్నీని అదుపులోకి తీసుకున్నారు! వాస్తవానికి అల్లు అర్జున్ పై ఈ ఏడాది ఇది మూడో కేసు. సార్వత్రిక ఎన్నికల సమయంలో నంద్యాలకు వెళ్లినప్పుడు ఒక కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో.. అల్లు అర్జున్ "ఆర్మీ" అని వాడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు అందిన వ్యవహరం చర్చనీయాంశమైంది! ఈ నేపథ్యంలో తాజాగా సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో బీ.ఎన్.ఎస్. సెక్షన్స్ 105, 118 (1) కింద ఎఫ్.ఐ.ఆర్.లో నమోదు చేశారు పోలీసులు. ఇందులో నిందితులుగా... సంధ్యా థియేటర్ యాజమాన్యం.. అల్లు అర్జున్.. అతని వ్యక్తిగత భద్రతా సిబ్బంది ని చేర్చారు. ఇందులో సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ స్టాఫ్ ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ ని పోలీసులు స్టేషన్ కు తరలించారు. దీంతో... అల్లు అర్జున్ కు రిమాండ్ తప్పదా అనే ఆందోళన ఆయన అభిమానుల్లో మొదలైందని అంటున్నారు.
కాగా.. మృతురాలు రేవతి భర్త భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అల్లు అర్జున్ థియేటర్ కి వచ్చిన సమయంలో ఆయన చుట్టుపక్కల ఉన్న పర్సనల్ స్టాఫ్.. వాళ్లు జరిపిన తోపులాట వల్లే తన భార్య చనిపోయిందని భాస్కర్ తన ఫిర్యాదులో స్పష్టం చేశారని అంటున్నారు.
ఇక... ఈ కేసులో ఉన్న సెక్షన్స్ బీ.ఎన్.ఎస్. 105, 118 (1) లలో శిక్ష పదేళ్ల కంటే ఎక్కువ ఉందని.. అందువల్ల స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం లేదనే చర్చ మొదలైంది.