సంధ్య థియేటర్ ఘటన.. తన ప్రమేయంపై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు!
ఈ సమయంలో పుష్ప-2 దర్శకుడు సుకుమార్ బన్నీని అత్మీయ ఆలింగనం చేసుకున్నారు.. సుకుమార్ ఎమోషనల్ అయ్యారు. అనంతరం బన్నీ మీడియాతో మాట్లాడారు.
By: Tupaki Desk | 14 Dec 2024 7:31 AM GMTసంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో అరెస్టైన అల్లు అర్జున్ కు శుక్రవారం హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పలు కారణాలతో ఆయన శుక్రవారం రాత్రి చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు. శనివారం ఉదయం 6:45 గంటల ప్రాంతంలో విడుదలయ్యారు. అనంతరం గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లారు.
ఆ సమయంలో తన న్యాయవాదులతో మాట్లాడిన అల్లు అర్జున్.. అనంతరం తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ కి కలిశారు. ఈ సమయంలో పుష్ప-2 దర్శకుడు సుకుమార్ బన్నీని అత్మీయ ఆలింగనం చేసుకున్నారు.. సుకుమార్ ఎమోషనల్ అయ్యారు. అనంతరం బన్నీ మీడియాతో మాట్లాడారు.
అవును... చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన అనంతరం అల్లు అర్జున్ తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా... దేశవ్యప్తంగా తనకు మద్దతుగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో తనపై అపరిమితమైన ప్రేమ చూపించిన అభిమానులకు అల్లు అర్జున్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధానంగా... సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటన గురించి మాట్లాడిన అల్లు అర్జున్... అది దురదృష్టకర ఘటన అని.. ఆ కుటుంబానికి జరిగిన దానికి తాను ఎంతగానో చింతిస్తున్నానని అన్నారు. ఇదే సమయంలో.. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని అల్లు అర్జున్ వెల్లడించారు.
అది ప్రమాదవశాత్తు జరిగిందని.. ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదని.. అనుకోకుండా జరిగిన ఆ ఘటనలో తన ప్రమేయం ఏమీ లేదని.. కుటుంబంతో కలిసి తాను థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు అది జరిగిందని అల్లు అర్జున్ వివరించారు. ఇక.. తాను సుమారు 20 ఏళ్ల నుంచి ఆ థియేటర్ కు వెళ్తున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో సుమారు 30 సార్లు అక్కడ తాను సినిమా చూశానని.. అయితే, గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదని.. ప్రస్తుతం కేసు కోర్టులో ఉందని.. దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదని.. త్వరలోనే బాధితురాలి కుటుంబాన్ని కలుస్తానని అల్లు అర్జున్ వెల్లడించారు.