అల్లు అర్జున్ ను పోలీసులు అడుగుతున్న ప్రశ్నలు!!
"పుష్ప-2" విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 24 Dec 2024 6:20 AM GMT"పుష్ప-2" విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. దీంతో.. ఈ రోజు ఉదయం తన లీగల్ టీమ్ తో కలిసి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.
అవును... పోలీసుల నోటీసు మేరకు అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం 11 గంటలకే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా.. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ను సెంట్రల్ జోన్ డీసీపీ, చిక్కడపల్లి ఏసీపీ విచారిస్తున్నారని తెలుస్తోంది.
ఈ సమయంలో తన న్యాయవాదితో కలిసి అల్లు అర్జున్ విచారణలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ విచారణ సుమారు 2 నుంచి 2:30 గంటల పాటు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. చిక్కడపల్లి పీఎస్ ఫస్ట్ ఫ్లోర్ లోని సీఐ ఛాంబర్ లో ఈ విచారణ జరుగుతుందని తెలుస్తోంది.
పోలీసుల ప్రశ్నలు!!:
మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్ కు వచ్చారు?
రేవతి చనిపోయిన సంగతి మీరు థియేటర్ లో ఉన్నప్పుడు తెలియదా?
ఏసీపీ, సీఐ మిమ్మల్ని థియేటర్ లో కలిశారా.. లేదా?
మీతో వచ్చిన బౌన్సర్లు మొత్తం ఎంతమంది?.. ఎక్కడ నుంచి వచ్చారు?
ప్రేక్షకులు, అభిమానులపై దాడి చేసిన బౌన్సర్ల వివరాలు ఏమిటి?
ప్రెస్ మీట్ లో మీరు చెప్పిన విషయాలపై మీ వివరణ ఏమిటి?
తొక్కిసలాట కారణంగా ఓ మహిళ చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది?
మీరు 2 గంటలకు పైగా థియేటర్ లో ఉన్నది వాస్తవం కాదా?
అనుమతి లేకుండా స్మారు 850 మీటర్ల మేర రోడ్ షో ఎందుకు చేశారు?
పోలీసులు చెప్పిన తర్వాత కూడా తిరిగి వెళ్లేటప్పుడు ఎందుకు కార్లో నుంచి పైకి వచ్చి అభివాదం చేశారు?
థియేటర్ కి వస్తున్నట్లు మీరు ఎవరెవరికి సమాచారం ఇచ్చారు?
వంటి మొదలైన ప్రశ్నలు అడుగుతున్నారని అంటున్నారు. ఇదే సమయంలో ప్రధానంగా మీడియా ముందు అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా అన్నట్లుగా.. పోలీసులు ఇటీవల విడుదల చేసిన వీడియోని చూపిస్తు.. మరికొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉందని అంటున్నారు. వీటికి అల్లు అర్జున్ ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది తీవ్ర సంచలనంగా మారింది.