అల్లు అర్జున్ ఈ రోజుకి జైల్లోనే ఉండాలా..?
మరోపక్క అల్లు అర్జున్ జైలు నుంచి ఈ రోజు విడుదల కావడం కష్టమే అనే చర్చా తెరపైకి వచ్చిందని అంటున్నారు.
By: Tupaki Desk | 13 Dec 2024 6:43 PM GMTసంధ్య థియేటర్ ఘటనపై నమోదైన కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో... ఈ విషయం ఒక్కసారిగా అభిమానుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. అయితే... ఈ ఉత్తర్వులు వెలువడిన కాసేపటికే తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం జరిగింది. ఇందులో భాగంగా.. అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరు చేసింది.
అల్లు అర్జున్ కి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు మీద ఈ బెయిల్ మంజూరు చేయాలని సూచించింది. అయితే.. అప్పటికే నాంపల్లి కోర్టు రిమాండ్ ఆదేశాలు ఇవ్వడంతో.. అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకి తరలించారు. ఈ సమయంలో.. ఈ రోజుకి అల్లు అర్జున్ జైల్లోనే ఉండాలా అనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తర్వాత.. ఆ కాపీని ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తారు! తర్వాత దానికి సంబంధించిన హార్డ్ కాపీని జైలు అధికారులకు అల్లు అర్జున్ లాయర్లు అందిస్తారు. అది జరిగింది! ఈ సమయంలో.. ఆర్డర్ కాపీ అందిన తర్వాత రెగ్యులర్ ప్రొసిజర్ 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకూ పడుతుందని అంటున్నారు.
దీంతో.. సుమారు 7 గంటల నుంచి అల్లు అర్జున్ విడుదల గురించి అటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు ఎదురుచూస్తున్నారు. మరోపక్క చాలా మంది అభిమానులు చంచల్ గూడ జైలు వద్దకు చేరుకున్నారు. అయితే... రాత్రి 10:30 గంటలు అయినప్పటికీ అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు విడుదల కాలేదు.
ఈ నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొందని అంటున్నారు. మరోపక్క అల్లు అర్జున్ జైలు నుంచి ఈ రోజు విడుదల కావడం కష్టమే అనే చర్చా తెరపైకి వచ్చిందని అంటున్నారు. దీంతో.. ఈ రోజు రాత్రంతా అల్లు అర్జున్ జైల్లోనే ఉండే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
దీనిపై స్పందించిన జైలు అధికారులు.. తమకు ఇప్పటివరకూ అధికారికంగా బెయిల్ ఉత్తర్వ్యులు అందలేదని అంటున్నారని తెలుస్తోంది. బెయిల్ ఉత్తర్వుల కాపీలు ఆన్ లైన్ లో ఇంకా అప్ లోడ్ కాలేదని.. అల్లు అర్జున్ తరుపు లాయర్లు తెచ్చిన బెయిల్ కాపీ సరిగ్గా లేదని జైలు అధికారులు అంటున్నారని తెలుస్తోంది.
మరోపక్క హైకోర్టు ఉత్తర్వ్యులు ఇచ్చి, ఆ కాపీని అల్లు అర్జున్ తరుపు లాయర్లు జైలు అధికారులకు అందజేసి సుమారు నాలుగు గంటలు కావొస్తున్నా.. ఇంకా జాప్యం ఏమిటంటూ చంచల్ గూడ జైలు బయట అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు! దీంతో... బన్నీకి ఈ రోజు జైలు నిద్ర తప్పదా అనే చర్చ మొదలైదని తెలుస్తోంది!!