బిగ్ బ్రేకింగ్... అల్లు అర్జున్ అరెస్ట్!!
సంధ్య థియేటర్ ఘటనలో భాగంగా అల్లు అర్జున్ ను చిక్కడ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు.
By: Tupaki Desk | 13 Dec 2024 7:38 AM GMTప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో పుష్ప-2 సందడి చేస్తోంది.. కలెక్షన్స్ లో సరికొత్త చరిత్ర క్రియేట్ చేసిందని చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ఆ సినిమా హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనలో భాగంగా అల్లు అర్జున్ ను చిక్కడ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు.
అవును... సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారని అంటున్నారు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారని తెలుస్తోంది. దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. పుష్ప-2 విడుదల సందర్భంగా... ఈ నెల 4వ తేదీ రాత్రి సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే.
ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు ఆస్పత్రి పాలయ్యాడు! దీంతో... ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ ను నిందితుడిగా చేర్చారు! అయితే... తనపై నమోదైన కేసు కొట్టేయాలని అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారనే విషయం తీవ్ర సంచలనంగా మారింది. పైగా ఇది నాన్ బెయిలబుల్ కేసు కావడంతో.. స్టేషన్ బెయిల్ దక్కే అవకాశం లేదని.. పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టిన అనంతర, రిమాండ్ కు తరలించే అవకాశం ఉందని మీడియాలో కథనాలొస్తున్నాయి.
మరోపక్క... ఈ వ్యవహారంపై స్పందించిన అల్లు అర్జున్ టీమ్.. ఇది అరెస్ట్ కాదని చెబుతున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్ ని విచారణ నిమిత్తం మాత్రమే పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తున్నారని.. అరెస్ట్ కాదని.. విచారణకు హాజరవ్వడానికే స్టేషన్ కు వెళ్లారని చెబుతున్నారు!