ఫ్లవర్ అంటే గుండెల్లో తడి పుష్పా !
అంతే కాదు తెలుగు వారికి అందని పండుగా మారిన జాతీయ అవార్డుని కూడా ఆయన సాధించారు సినిమాల్లో అర్జున్ నటన బాగుంటుంది అంటే దానికి కారణం డైరెక్టర్లు ఇచ్చే మెలకువలు.
By: Tupaki Desk | 24 Dec 2024 3:58 AM GMTఅల్లు వారి వంశం గొప్పది. విఖ్యాత నటుడు అల్లు రామలింగయ్య తెలుగు సినీ సీమకు లెజండరీ పర్సనాలిటీగా నిలిచి ఈ రోజుకూ కీర్తి కాయంతో వెలుగొందుతున్నారు. 1952లో పుట్టిల్లు సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆయనది అయిదు దశాబ్దాల సుదీర్ఘమైన సినీ ప్రయాణం. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం ఆయన గొప్పదనం. చిన్న పాత్ర ఇచ్చినా దానిని గుర్తుండిపోయేలా చేసే నటనా వైదుష్యం ఆయన సొంతం.
అల్లు రామలింగయ్య కుమారులు ఎవరూ నటనను వృత్తిగా స్వీకరించలేదు కానీ అల్లు అరవింద్ నిర్మాతగా మారి 1972లో గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను గత యాభై ఏళ్ళుగా నిర్మిస్తూ వస్తున్నారు. ఆయన టాలీవుడ్ టాల్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు.
మూడవ తరంలో అల్లు అర్జున్ నటుడిగా 2002లో గంగోత్రి చిత్రం ద్వారా కేవలం ఇరవై ఏళ్ల వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చారు తొలి సినిమా సంగతి ఎలా ఉన్నా మలి సినిమా అర్యతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అది లగాయితూ సినిమా సినిమాకూ తన నటనను పెంచుకుంటూ ఈ రోజుకు పాన్ ఇండియా స్టార్ డం సాధించారు. అల్లు అర్జున్ సినీ జీవితం గురించి చెప్పాలీ అంటే పుష్ప ముందు తరువాత అన్న విభజన చేయాల్సిందే.
అంతే కాదు తెలుగు వారికి అందని పండుగా మారిన జాతీయ అవార్డుని కూడా ఆయన సాధించారు సినిమాల్లో అర్జున్ నటన బాగుంటుంది అంటే దానికి కారణం డైరెక్టర్లు ఇచ్చే మెలకువలు. అయితే ఈ రీల్ హీరోకు రియల్ లైఫ్ లో కష్టాలు ఒక్కసారిగా వచ్చిపడ్డాయి. హీరోకు ఇపుడు చిక్కులు వచ్చిపడ్డాయి.
అయితే ఆ చిక్కులు విప్పుకోవాల్సింది మాత్రం రియల్ లైఫ్ లో హీరోనే. ఇక్కడ డైరెక్టర్లు ఎవరూ ఉండదు. ఒకవేళ ఎవరు ఏమైనా సలహా ఇచ్చినా అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది ఆయన. వాటి ఫలితాలకు బాధ్యత వహించాల్సింది ఆయనే.
ప్రస్తుతం ఆయన సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించి కుమారుడు చావు బతుకుల మధ్యలో ఆసుపత్రిలో పోరాడుతున్న ఒక సంఘటనకు సంబంధించి ఏ 11 నిందితుడిగా ఉన్నారు. అల్లు అర్జున్ ఈ కేసులో భాగంగా జైలులో కూడా ఒక రాత్రి గడిపి వచ్చారు.
ఇక్కడ విషయం ఏంటి అంటే తాను గత ఇరవి ఏళ్ళుగా తన సినిమాను థియేటర్ లోనే చూస్తున్నాను ఈసారి అలా యాక్సిడెంటల్ గా విషాదం జరిగింది అని హీరో అల్లు అర్జున్ చెబుతున్నారు. ఆయన పదే పదే యాక్సిడెంటల్ అని అంటున్నారు. యాక్సిడెంటల్ అయినా మరొటి అయినా పోయింది నిండు ప్రాణం.
నైతిక బాధ్యత ఎవరో ఒకరు వహించాలి. ఇందులో ఎవరిది ఎంత తప్పు అన్నది విచారణలో కోర్టు తీర్పు ద్వారా వెల్లడి అవుతుంది ఈ మధ్యలో మీడియాతో ఎంత మాట్లాడినా జరిగేది ఏమీ ఉండకపోగా అనవసరంగా కొత్త వివాదాలే రాజేయబడతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగానికి బదులు అన్నట్లుగా అదే రోజు రాత్రి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం బూమరాంగ్ అయింది అని తరువాత వరస ఘటనలు తెలియచేశాయి.
ఆయన సైలెంట్ గా ఉండిపోవాల్సింది. మరి ఆ డైరెక్షన్ ఆయనదే అయితే ఇక్కడ హీరో గారు తడబడినట్లే. అంతే కాదు అల్లు అర్జున్ ఈ తరహా ఘటనలు గతంలో ఫేస్ చేసి ఉండకపోవచ్చు. అందువల్ల ఆయన మీడియా ముందు కూడా మామూలుగానే మాట్లాడారు. అయితే అవి విమర్శించే వారికి ఆయనలో బాధ లేనితనంగా కనిపించవచ్చు.
ఆ విషయం అలా ఉంచితే ఆయన రోడ్ షో చేయలేదని అన్నారు. కానీ వీడియోలో రోడ్ షో చేసినట్లుగా ఉంది. తనకు బయట తొక్కిసలాటలో ఎవరో చనిపోయింది మరుసటి రోజు కానీ తెలియలేదు అన్నారు. సమాచారం ఇంతగా విస్తృతమైన ఈ రోజులలో ఆ విషయం వెంటనే తెలియలేదు అంటే కూడా ఆశ్చర్యపోయిన వారు ఉన్నారు.
ఏది ఏమైనా పుష్ప వన్ జాతీయ అవార్డుని తెచ్చింది. పుష్ప టూ సక్సెస్ అయిన కూడా వివాదాన్ని తెచ్చింది. ఆ విధంగా అల్లు వారబ్బాయికి కొత్త పాఠాలనూ నేర్పుతోంది అనుకోవచ్చు. తన ప్రమేయం లేని చోట కూడా రోడ్డు ప్రమాదంలో ఎవరైనా తీవ్రంగా గాయపడి ఉంటే వెంటనే వెళ్ళి సపర్యలు చేయడమే హీరోయిజం.
తన సినిమా కోసం ఆ మీదట తనను చూసేందుకు వచ్చిన ఒక ఆడబిడ్డ, మరో చిన్న బిడ్డ ఇలా ప్రాణాలతో పోరాటం చేశారు అన్నది ఎపుడు తెలిసినా వెంటనే పోయి పరామర్శించడమే రియల్ లైఫ్ హీరోయిజం. డబ్బులు ఇవ్వడం ఆదుకుంటామని చెప్పడం తరువాత విషయాలు. ముందు పని అల్లు అర్జున్ చేసి ఉంటే ఇంతటి ఇబ్బంది వచ్చి ఉండేది కాదు.
రీల్ లైఫ్ లో పాన్ ఇండియా హీరోగా సక్సెస్ కొట్టిన ఆయన రియల్ లైఫ్ లో పెయిన్ ఫుల్ హీరోగా మారి ఇబ్బంది పడుతున్నారు అంటే ఎక్కడో డైరెక్షన్ లోపం ఉందనే కదా. ఆలోచించుకోవాల్సిందే మరి. పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అన్నది రీల్ హీరో డైలాగ్. రియల్ హీరోలో ఫ్లవర్ లాంటి సున్నిత తత్వం ఉండాల్సిందే. అది ఆయనకు చాలానే ఉంది కానీ చూపించాల్సిన చోట చూపించడమే అసలైన డైరెక్షన్ మెరిట్ మరి.