రాజకీయం కాదు.. అయినవారి కోసం మాత్రమే: అల్లు అర్జున్
అల్లు అర్జున్ మాట్లాడుతూ-''నేను అధికారికంగా ఏ రాజకీయ పార్టీతో కనెక్ట్ కాను. అన్ని పార్టీలతోను తటస్థంగా ఉంటాను. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా నా సన్నిహితులు, ఆప్తులకు నేను ఎల్లప్పుడూ మద్దతును అందిస్తాను.
By: Tupaki Desk | 13 May 2024 5:59 AM GMTతన స్నేహితుడు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డిని ముందస్తు అనుమతితో సందర్శించనందుకు గాను ఆంధ్రప్రదేశ్ నంద్యాలలో పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. శిల్పా రవిరెడ్డి, అల్లు అర్జున్ లపై కేసులు నమోదయ్యాయి. లోక్‌సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ లో భాగంగా.. సోమవారం నాడు హైదరాబాద్‌లో ఓటు వేసిన అల్లు అర్జున్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తాను రాజకీయంగా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోనని స్పష్టం చేశారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ-''నేను అధికారికంగా ఏ రాజకీయ పార్టీతో కనెక్ట్ కాను. అన్ని పార్టీలతోను తటస్థంగా ఉంటాను. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా నా సన్నిహితులు, ఆప్తులకు నేను ఎల్లప్పుడూ మద్దతును అందిస్తాను. అది నా మామ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. నంద్యాలలో నా మిత్రుడు శిల్పా చంద్ర రవి రెడ్డి కావచ్చు లేదా మా మామ చంద్రశేఖర్ రెడ్డి గారు కావొచ్చు.. నా ప్రేమ మద్దతు ఎల్లప్పుడూ వారికి ఉంటుంది'' అని అన్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా నేను ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటాను. నాకు సన్నిహితంగా ఉండే వ్యక్తులకు నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది అని ఆయన అన్నారు. శిల్పా రవిరెడ్డి ఇంటికి తన భార్యతో కలిసి వెళ్లి విష్ చేసి వచ్చానని అల్లు అర్జున్ వెల్లడించారు.
తమ భవిష్యత్తు బాగుపడాలంటే ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయాలని అల్లు అర్జున్ ఈ సందర్భంగా కోరారు. దయచేసి మీ ఓటు వేయండి. ఇది దేశ పౌరులందరి బాధ్యత.. రాబోయే ఐదేళ్ల కోసం ఈ రోజు అత్యంత కీలకమైన రోజు.. అని అన్నారు. ఎక్కువ మంది ప్రజలు ఓటు వేయడానికి వస్తున్నందున భారీ ఓటింగ్ ఉంటుందని అల్లు అర్జున్ అభిప్రాయపడ్డారు.
ఎలక్షన్ డేకి రెండు రోజుల ముందు అంటే.. మే 11 న శిల్పా రవి రెడ్డిని కలవడానికి అలు అర్జున్ వారి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అతడిని చూసేందుకు వేలాదిగా అభిమానులు, ప్రజలు రోడ్డుపై గుమిగూడారు. అయితే నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడంతో ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డి - శిల్పా రవితో కలిసి ఎమ్మెల్యే ఇంటి బాల్కనీలో కనిపించి, భారీ జనసమూహానికి అభివాదం చేసారు.
శిల్పా రవిరెడ్డిని కలిసిన తర్వాత, తన పర్యటన నుండి ఫోటోను తన అధికారిక X ఖాతాలో అల్లు అర్జున్ షేర్ చేసారు. నంద్యాల ప్రజల ఆదరణకు ధన్యవాదాలు తెలిపారు. ఆతిథ్యం ఇచ్చినందుకు శిల్పా రవికి కృతజ్ఞతలు తెలిపారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ తదుపరి పుష్ప 2లో కనిపించనున్నాడు.