కీలక అడుగుల దిశగా జియో... అంబానీ సంచలన ప్రకటన!
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ భవిష్యత్తు ప్రణాళికపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు.
By: Tupaki Desk | 28 Aug 2023 12:57 PM GMTరిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 46వ సర్వసభ్య సమావేశంలో కంపెనీ కీలక నిర్ణయాలను ప్రకటిస్తోంది. ఇదే సమయంలో రిలయన్స్ బోర్డులోకి ముకేశ్ అంబానీ వారసులు ఎంట్రీతో పాటు 5జి, ఏఐ, ఇన్సూరెన్స్ వంటి మరెన్నో కీలక విషయాలు ఈ సందర్భంగా జరిగాయి.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ భవిష్యత్తు ప్రణాళికపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా జియో టెలికాం సేవలను చందాదారుల సంఖ్య 45 కోట్లు దాటిందని వెల్లడించారు. ఇదే సమయంలో 5జీ సేవలను ప్రారంభించిన 9 నెలల్లోనే 96 శాతం పట్టణాల్లో 5జీ నెట్ వర్క్ విస్తరణ పూర్తయినట్లు ముకేశ్ తెలిపారు.
రిలయన్స్ ఏజీఎంలో ఏఐ:
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విప్లవం నడుస్తోన్న వేళ... ముకేశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ అప్లికేషన్లు పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థలు, రోజువారీ జీవితంతోనూ భాగస్వామ్యం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో... ఈ ఏఐ విప్లవంలో రిలయన్స్ సైతం భాగస్వామ్యం అవుతోందని ప్రకటించారు.
ఇదే సమయంలో ఏడేళ్ల క్రితం జియో బ్రాండ్ గురించి హామీ ఇచ్చి ఎలా నెరవేర్చామో.. అదే తరహాలోనే ఏఐ ని జియో అన్ని చోట్లా, అందరికీ అందుబాటులోకి తీసుకురానుందని ముకేశ్ అంబానీ చెప్పారు.
జియో 5జి సేవల విస్తరణ:
జియో టెలికాం సేవలను చందాదారుల సంఖ్య 45 కోట్లు దాటిందని ముకేశ్ అంబానీ తెలిపారు. డిసెంబర్ నాటికి దేశవ్యాప్త సేవల విస్తరణ లక్ష్యాన్ని పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఈ విషయంలో ఇప్పటికే 5 కోట్ల మంది జియో 5జీ సేవలను ఆనందిస్తున్నారని చెప్పిన ఆయన... నెలకు సగటున 25జీబీ డేటా వినియోగం జియో ద్వారా జరుగుతోందని తెలిపారు.
ఇదే క్రమంలో... వినాయక చవితిని పురస్కరించుకుని సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ ను లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే, దీని ధర, ప్లాన్లు, ఇతర వివరాలేవీ వెల్లడించలేదు.
జియో ఇన్సూరెన్స్ పాలసీలు:
రానున్న రోజుల్లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్.. ఇన్సూరెన్స్ విభాగంలోకి అడుగు పెట్టబోతున్నట్లు ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు. జియో ఫైనాన్షియల్ ద్వారా కస్టమర్లకు లైఫ్, జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా... ప్రపంచంలోనే అత్యధిక క్యాపిటలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీస్ ప్లాట్ ఫామ్స్‌లో ఒకటిగా రూ. 1,20,000 కోట్ల నికర విలువతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ నిలిచినట్లు తెలిపారు. ఇదే క్రమంలో... రిలయన్స్ వాటాదారులు అందరూ కొత్తగా తీసుకొచ్చిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వాటాదారులే అని ముకేశ్ అంబానీ ప్రకటించారు.
రిలయన్స్ బోర్డులోకి వారసులు:
గత ఏడాదే తన ముగ్గురు పిల్లలు ఈశా అంబానీ, ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీకి కీలక బాధ్యతలు అప్పగించిన ముకేశ్ అంబానీ.. ఈ ఏడాది వారిని కంపెనీ బోర్డులోకి తీసుకున్నారు. వీరు ఇకపై నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల హోదాలో వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో సైతం కంపెనీ వెల్లడించింది.
అంటే... ఇప్పటి వరకు కేవలం వ్యాపార నిర్వహణ బాధ్యతల్లో మాత్రమే భాగస్వాములవుతూ వచ్చిన వీరు ముగ్గురు... ఇకపై కంపెనీ నిర్ణయాలు, విధానాల రూపకల్పనల్లోనూ ప్రధాన పాత్ర పోషించనున్నారు.
మరోవైపు ముకేశ్ అంబానీ మరో ఐదేళ్ల పాటు కంపెనీ ఛైర్మన్ హోదాలో కొనసాగేందుకు రిలయన్స్ తమ షేర్ హోల్డర్ల అనుమతి కోరనుంది. మరోపక్క ముకేశ్ సతీమణి నీతా అంబానీ.. బోర్డు డైరెక్టర్ పదవి నుంచి వైదొలగారు.