Begin typing your search above and press return to search.

‘రెడ్ బుక్ కు ఇంట్లో కుక్క కూడా భయపడదు’.. అంబటిలో ఎంత మార్పు?

ఏపీలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 Jan 2025 5:20 AM GMT
‘రెడ్  బుక్  కు ఇంట్లో కుక్క కూడా భయపడదు’..  అంబటిలో ఎంత మార్పు?
X

ఏపీలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పెన్షన్, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు, ఇసుక పాలసీ, నూతన మద్యం విధానం, అన్న క్యాంటీన్ మొదలైన హామీలు నెరవేర్చామని.. మిగిలినవాటికి కాస్త టైం పడుతుందని, ప్రజలు అర్ధం చేసుకోవాలని చెప్పారు.

దానికి కారణం.. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడమే అని తెలిపారు. ఇదే సమయంలో దావోస్ పర్యటనలో పెట్టుబడులు సున్నా అంటూ వస్తోన్న విమర్శలపై స్పందించిన బాబు.. దావోస్ వెళ్లేది పెట్టుబడుల కోసం కాదని.. దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది కేవలం మిత్ అని స్పష్టం చేశారు. దీనిపై అంబటి రాంబాబు స్పందించారు.

అవును... ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలపై తాజాగా చంద్రబాబు చేసిన "ప్రజలు అర్ధం చేసుకోవాలి.. కాస్త సమయం పడుతుంది" వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ఈ సందర్భంగా... నీతి ఆయోగ్ లెక్కలని, వైసీపీ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిందని చెబుతూ హామీలు అమలు చేయలేమని చెప్పడం దారుణమని అన్నారు.

చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేరని వైఎస్ జగన్ ఆనాడే స్పష్టం చేశారని గుర్తుచేశారు. ఇక.. వైసీపీ ప్రభుత్వ హాయాంలో రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసిందంటు విష ప్రచారం చేశారని.. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మాత్రం అప్పులు రూ.6,46,537 కోట్లు మాత్రమే అని తేల్చారని వివరించారు.

మరోపక్క... చంద్రబాబు దావోస్ వెళ్తున్నారని, రాష్ట్రానికి పెట్టుబడుల వరద ముంచెత్తనుందని చెబుతూ హడావిడి చేశారని.. తీరా దావోస్ వెళ్లిన చంద్రబాబు ఉత్త చేతులతో తిరిగి వచ్చారని ఎద్దేవా చేసిన అంబటి.. రూ.కోట్ల ప్రజాధనం ఖర్చు చేసినా ఒక్క ఎంఓయూ లేదని.. ఇది చంద్రబాబు అసమర్థత అని విమర్శించారు.

ఈ నేపథ్యంలోనే... రెడ్ బుక్ ప్రస్థావన తీసుకొచ్చారు అంబటి రాంబాబు. ఇందులో భాగంగా... లోకేష్ ఎర్ర బుక్కుకు తన ఇంట్లో కుక్క కూడా భయపడదని, అక్రమ కేసులతో ఎంతమందిని జైలుకు పంపినా వైసీపీ వెనుకంజ వేయదని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

దీంతో.. కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో.. ఎక్కడ ఏ అరెస్ట్ జరిగినా, మరెక్కడ ఏ దాడి ఘటన జరిగినా.. అది రెడ్ బుక్ మహిమే అని గగ్గోలు పెట్టిన అంబటి రాంబాబు.. ఇప్పుడు సడన్ గా రెడ్ బుక్ కి తన ఇంట్లో కుక్క కూడా భయపడదు అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటబ్బా అనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు.