Begin typing your search above and press return to search.

అమలాపురం ఎంపీ అభ్యర్థి ఫిక్స్!

అవును... వచ్చే ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్.

By:  Tupaki Desk   |   21 Feb 2024 11:30 AM GMT
అమలాపురం ఎంపీ అభ్యర్థి ఫిక్స్!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం లోక్ సభ స్థానానికి ప్రధాన పార్టీల నుంచి ఇప్పటివరకూ అభ్యర్థుల పేర్లు కన్ ఫాం కాకపోవడం గమనార్హం! ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ చింతా అనురాధ మరోసారి పోటీ చేసే విషయంపై సందిగ్ధత నెలకొందని అంటున్న నేపథ్యంలో... అధికార పార్టీ ఎంపీ అభ్యర్థి ఎవరనే చర్చ తెరపైకి వచ్చింది.

మరోపక్క గతంలో టీడీపీ నుంచి జిఎంసీ బాలయోగి వరుసగా ఇక్కడ నుంచి గెలిచినా.. తర్వాతి కాలంలో ఇక్కడ కాంగ్రెస్ పాగా వేసింది. ఈ సమయంలో బాలయోగి కుమారుడికే అవకాశం ఇవ్వొచ్చని అంటుండగా.. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారనే చర్చ కోనసీమ కేంద్రంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ మాత్రం... వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించుకున్నారు.

అవును... వచ్చే ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్. తాజాగా తన మనసులో మాట బయటపెట్టిన ఆయన... సోషల్ మీడియాలో అమలాపురం స్థానంపై తాను నిర్వహించిన సర్వేలో సుమరు 79% తనకు అనుకూల ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఎంపీగా సేవ చేసిన అమలాపురం నుంచే తాను పోటీచేస్తానని చెబుతున్నారు!

కాగా... 2004, 2009 ఎన్నికల్లో అమలాపురం ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జీవీ హర్ష కుమార్... రెండు సార్లూ వరుసగా గెలిచారు. ఈ రెండు సార్లూ 40వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. ఈ క్రమంలో 2004లో టీడీపీ అభ్యర్థిపైనా, 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిపైనా హర్షకుమార్ విజయం సాధించారు. ఇదే సమయంలో రాష్ట్ర విభజన అనంతరం కూడా ఆయన బరిలోకి దిగారు.

ఇందులో భాగంగా రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా... నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోని "జై సమైఖ్యాంద్ర పార్టీ" నుంచి పోటీ చేశారు. ఈ 2014 ఎన్నికల్లో ఆయనకు కేవలం 9,931 ఓట్లు రావడం గమనార్హం! ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఆ ఆలోచన చేయని ఆయన... 2024 ఎన్నికల్లో బరిలోకి దిగే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు!!