Begin typing your search above and press return to search.

అమర్‌ కు జై.. అదీప్‌ కు నై!

అటు అమర్‌ నాథ్, ఇటు అదీప్‌ రాజ్‌ ఇద్దరూ కూడా తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. పవన్‌ కళ్యాణ్‌ పై తీవ్ర విమర్శల ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ మనసు చూరగొని అమర్‌ నాథ్‌ మంత్రి పదవిని దక్కించుకున్నారు.

By:  Tupaki Desk   |   9 Jan 2024 6:08 AM GMT
అమర్‌ కు జై.. అదీప్‌ కు నై!
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్‌ చేస్తున్న మార్పులుచేర్పులు ఆ పార్టీలో కొంత అసంతృప్తికి దారి తీస్తున్న సంగతి తెలిసిందే. కొందరికి సీట్లు పూర్తిగా నిరాకరిస్తున్న సీఎం జగన్‌.. మరికొందరిని ప్రస్తుతం ఉన్న స్థానాల నుంచి కొత్త స్థానాలకు పంపుతున్నారు. మరికొన్నిచోట్ల కొత్త అభ్యర్థులను దింపుతున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బెల్లానికి ప్రసిద్ధిగాంచిన అనకాపల్లిలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌ నాథ్‌ కు ఈసారి జగన్‌ సీటును నిరాకరించారు. అనకాపల్లిలో భరత్‌ కుమార్‌ అనే కొత్త అభ్యర్థికి జగన్‌ సీటును కేటాయించారు. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన రెండో జాబితాలో భరత్‌ కుమార్‌ పేరు చోటు చేసుకుంది. అమర్‌ నాథ్‌ తోపాటు భరత్‌ కుమార్‌ కూడా కాపు సామాజికవర్గానికి చెందినవారే.

కాగా వైసీపీ అధిష్టానం ఇప్పటివరకు అభ్యర్థుల స్థానాల్లో మార్పులుచేర్పులు చేస్తూ రెండు విడతల్లో జాబితాలను ప్రకటించింది. అయితే ఐటీ, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్‌ నాథ్‌ కు మాత్రం ఇంతవరకు సీటు కేటాయించలేదు. మంత్రిగా కంటే కూడా జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ పైన తీవ్ర విమర్శలు చేయడం ద్వారానే అమర్‌ నాథ్‌ పాపులర్‌ అయ్యారని అంటుంటారు.

ఈ నేపథ్యంలో గుడివాడ అమర్‌ నాథ్‌ ను ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నుంచి కాకుండా పక్కనే ఉన్న పెందుర్తి నియోజకవర్గం నుంచి బరిలోకి దించుతారని అంటున్నారు. ప్రస్తుతం పెందుర్తి నుంచి వైసీపీ ఎమ్మెల్యే అన్నపురెడ్డి అదీప్‌ రాజ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఆయనకు సీటు దక్కదని అంటున్నారు.

అటు అమర్‌ నాథ్, ఇటు అదీప్‌ రాజ్‌ ఇద్దరూ కూడా తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. పవన్‌ కళ్యాణ్‌ పై తీవ్ర విమర్శల ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ మనసు చూరగొని అమర్‌ నాథ్‌ మంత్రి పదవిని దక్కించుకున్నారు. మరోవైపు అదీప్‌ రాజ్‌ మాత్రం ఎమ్మెల్యేగానే ఉండిపోయారు. అదీప్‌ రాజ్‌ కూడా కాపు సామాజికవర్గానికి చెందినవారే.

ఈ నేపథ్యంలో అనకాపల్లిలో గుడివాడ అమర్‌ నాథ్‌ కు గెలుపు అవకాశాలు లేకపోవడంతోనే ఆయనను పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయించే యోచనలో జగన్‌ ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అదీప్‌ రాజ్‌ కు ఈసారి సీటు కష్టమేనని పేర్కొంటున్నారు. నేడో రేపో వెలువడే మూడో జాబితాలో పెందుర్తి నుంచి గుడివాడ అమర్‌ నాథ్‌ పేరు ఖరారు కావడం ఖాయమని టాక్‌ నడుస్తోంది.