Begin typing your search above and press return to search.

వెన్నుపోటు వద్దు.. బయటకు వెళ్లిపోతే మంచిది.. గుడివాడ హితవు

దీంతో..టికెట్లు ఆశించి భంగపడేవారు పార్టీ మారే ఆలోచనలు చేస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళలో ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   3 Jan 2024 6:18 AM GMT
వెన్నుపోటు వద్దు.. బయటకు వెళ్లిపోతే మంచిది.. గుడివాడ హితవు
X

ఏపీ మంత్రి గుడివా అమర్ నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తావన వచ్చినంతనే కారాలు మిరియాలు నూరేసే ఆయన.. జనసేనానిపై అదే పనిగా నిప్పులు చెరగటం.. పంచ్ మీద పంచ్ లు వేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా టికెట్ల పంచాయితీ అధికార వైసీపీలో నడుస్తోంది. పని తీరు సరిగా లేకున్నా.. ప్రజల్లో ఇమేజ్ సరిగా లేని వారికి ఈసారి ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయటం తెలిసిందే.

అందుకు తగ్గట్లే.. ఆయన టికెట్ల కేటాయింపుపై క్లియర్ గా ఉన్నారు. ఎంతటి నేత అయినా సరే.. వారి పని తీరు సరిగా లేకున్నా.. ప్రజల్లో పట్టు తగ్గినట్లుగా నివేదికలు వస్తుంటే మాత్రం ఆయన కఠిన చర్యలకు వెనక్కి తగ్గట్లేదు. సంచలనాలకు వెనుకాడటం లేదు. 175 కు 175 అన్నదే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జగన్.. ఒక నేత కోసం పార్టీని ఓడిపోయే పరిస్థితికి ససేమిరా అంటున్నారు.

దీంతో..టికెట్లు ఆశించి భంగపడేవారు పార్టీ మారే ఆలోచనలు చేస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళలో ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024లో వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే వారే పార్టీలో ఉండాలని తమ అధినేత జగన్ చెప్పినట్లు స్పష్టం చేశారు. మాజీ మంత్రి.. ప్రస్తుతం వైసీపీలో ఉన్న దాడి వీరభద్రరావు మళ్లీ టీడీపీలోకి చేరనున్నట్లుగా సంకేతాలు బలంగా కనిపిస్తున్న వేళ.. మంత్రి గుడివాడ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

పార్టీ అధికారంలోకి రావటమే ముఖ్యమని.. వ్యక్తిగత ఇష్టాలకుతగ్గట్లుగా పార్టీ నిర్ణయాలు ఉండవన్నారు. అంతేకాదు.. రేపొద్దున తనకు టికెట్ రానప్పటికీ తాను బాధ పడనని.. టికెట్ లేదని చెప్పి పార్టీ జెండా చేతికి ఇచ్చి తిరగాలని చెబితే.. తాను నియోజకవర్గం మొత్తం తిరుగుతానని పేర్కొన్నారు. తనకు పార్టీ తప్పించి వ్యక్తిగత అంశాలేవీ ముఖ్యం కాదన్న కమిట్ మెంట్ మాటల్ని మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెబుతున్నారు. పార్టీలో గుడివాడ మాటలుఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.