Begin typing your search above and press return to search.

భారీ కాన్వాస్ గీస్తున్న బాబు...బూమరాంగ్ అవుతుందా ?

ఇక అమరావతి పేరు మీద తెచ్చిన అప్పులకు వడ్డీలకు తీర్చేలా రాజధాని నుంచి రిటర్న్స్ రావాల్సి ఉంది.

By:  Tupaki Desk   |   16 April 2025 3:00 AM
భారీ కాన్వాస్ గీస్తున్న బాబు...బూమరాంగ్ అవుతుందా ?
X

అమరావతి మీద టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉన్న మమకారం మాటలలో చెప్పలేనిది. పైగా బాబు మనసు అందరికీ తెలిసిందే. ఆయన ఏమి చేసినా భారీగానే ఉంటుంది. ఏది తక్కువ చేయాలనుకోరు. అయితే ఎంతటి సుదీర్ఘమైన గమ్యం అయినా ఒక అడుగుతోనే సాగాల్సి ఉంది.

అలా కాకుండా ఒకేసారి లంఘించి సముద్రాలను దాటేయడానికి ఆంజనేయుడి శక్తి ఎవరికీ లేదు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆయనకు 2014లో విభజన ఏపీకి తొలి సీఎం అయ్యే అవకాశం వచ్చింది. దాంతో రాజధానిని రాష్ట్రానికి ఎంపిక చేసే మహత్తర అవకాశం కూడా వచ్చింది.

అయితే చంద్రబాబు అయిదు కోట్ల ఆంధ్రులకు సరిపడ రాజధానిని నిర్మించాలని అనుకుంటే బాగుండేది. అలాగే ఏపీ భౌగోళిక పరిస్థితులను పరిమాణాన్ని కొలమానంగా తీసుకుని రాజధానిని రూపొందించాలనుకుంటే ఇంకా బాగుండేది. కానీ ఆయన ప్రపంచ రాజధాని అనేశారు.

దానికోసం ఏకంగా 34 వేల ఎకరాలను రైతుల నుంచి భూ సమీకరణ అనే వినూత్న విధానం ద్వారా సేకరించ గలిగారు. దానితో పాటుగా మరో 24 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇలా ఇప్పటికే అమరావతికి 58 వేల ఎకరాల భూమి సమకూరింది.

ఇందులో మొత్తం రాజధాని అవసరాలు అన్నీ తీరిపోగా పెద్ద ఎత్తున మిగులు భూమి ఉంటుందని అంచనా వేసుకున్నారు. ఇక చూస్తే అమరావతిలో తొలిదశ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభానికి శ్రీకారం చుడుతున్న వేళ మరో వార్త అయితే బయటకు వచ్చింది. 44 వేల ఎకరాలను మళ్ళీ రాజధాని కోసం సేకరిస్తామన్నది ఆ వార్త.

అయితే దీని మీద అయితే రకరకాలుగా చర్చ సాగుతోంది. అమ‌రావ‌తిలో రెండో విడ‌త భూసమీకరణ‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదని తాజాగా మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అయితే అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కోసం భూసేక‌ర‌ణ బ‌దులు పూలింగ్ చేయాల‌ని రైతులు కోరుతున్నారని ఆయన చెప్పారు. ఇక 30 వేల ఎక‌రాలు ల్యాండ్ పూలింగ్ చేస్తే ప్ర‌భుత్వానికి చివ‌రికి మిగిలేది ఐదువేల ఎక‌రాలే అని ఆయన లెక్క చెబుతున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే అమరావతి తొలిదశ పనులు పూర్తి చేయడానికి ఎలా లేదనుకున్నా మూడు నుంచి నాలుగేళ్ళ కాలం పడుతుంది అని అంటున్నారు. దాని కోసం దాదాపుగా అరవై వేల కోట్ల రూపాయలతో పనులు చేపట్టాల్సి ఉంది. ఇంత పెద్ద ఎత్తున తొలిదశ పనులు పెట్టుకుని ఇపుడు రెండవ విడత భూసేకరణ అంటే ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు.

ఒక క్రమపద్ధతిలో రాజధాని నిర్మాణం చేసుకోవాల్సి ఉందని అంటున్నారు. ఎపుడో పది పన్నెండేళ్ళ క్రితం భూములను రైతులు పెద్ద ఎత్తున ఇచ్చారు. ముందు వారి సంగతి చూడాల్సి ఉందని సలహాలు వస్తున్నాయి. మొదటి దశ పనులు పూర్తి చేసి మిగులు భూములను కనుక ప్లాట్లుగా విక్రయిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.

ఆ మీదట రాజధాని విస్తరణ అన్నది చూసుకోవచ్చు అన్నది కూడా ఉంది. ఇక ఇపుడు తొలిదశ పనుల విషయంలో కేంద్రం ఏమీ గ్రాంట్ గా కానీ వేరే విధంగా నిధులు ఇవ్వడం లేదు. అంతా అప్పులు చేసి తెస్తున్నారు. వాటికి అయ్యే వడ్డీలు ఇవన్నీ కూడా రానున్న కాలంలో ఇబ్బందిగా మారుతాయి. తొలిదశ పూర్తి చేస్తే ఆ మీదట రాజధాని ఏ విధంగా సెల్ఫ్ ఫైనాన్స్ కాపిటల్ అవుతుందో ఒక అంచనాకు రావడం జరుగుతుంది.

అంటే ఇపుడు చేస్తున్నది ఒక విధంగా భారీ ప్రయోగం. పూర్తి ఆశావహంగా ఉంటూ చేస్తున్నది. మరి ఇందులోనే ఎన్నో మలుపులు ఉంటూండగా దీని మీద ఫుల్ ఫోకస్ పెట్టకుండా మరో 44 వేల ఎకరాలు అని భూసేకరణ అని ఆలోచనలు చేయడం ఈ దశలో సబబు కాదనే మేధావులు అంటున్నారు. అమరావతి రాజధానికి భవనాలు నిర్మించగలరు, మౌలిక సదుపాయాలు కల్పించగలరు. అంతే తప్ప దానిని అన్ని వర్గాలతో కూడిన జనవాసంగా మార్చడం మాత్రం పాలకుల చేతిలో ఉండదని గుర్తించలేకపోతున్నారు.

ఎందుకంటే ఇపుడు చెబుతున్న దానిని బట్టి చూసినా లేక జరుగుతున్న ప్రచారం బట్టి చూసినా ఖరీదైన రాజధానిగా అమరావతి రాబోతోంది అని అంటున్నారు. అందువల్ల సామాన్యులు మధ్యతరగతి వర్గాలకు నివాసానికి ఏ మాత్రం ఆమోదయోగ్యంగా ఉంటుందో చూసుకోవాల్సి ఉంది అని అంటున్నారు.

ఇక అమరావతి పేరు మీద తెచ్చిన అప్పులకు వడ్డీలకు తీర్చేలా రాజధాని నుంచి రిటర్న్స్ రావాల్సి ఉంది. అలా వేలాది కోట్లు ఈ బృహత్తర యజ్ఞంలో ఇమిడి ఉంటాయన్నది మరువరాదు. ఇంకో వైపు చూస్తే 44 వేల ఎకరాలు తీసుకున్న దానికి అవసరమైన మౌలిక వసతుల సదుపాయాలు కూడా ప్రభుత్వం బాధ్యతే అవుతుంది.

ఈ మొదట తీసుకున్న భూసేకరణను ఒక కొలిక్కి తేకుండా ఆ ఆర్ధిక భారం ఎవరు మోస్తారు, ఏపీకి అప్పటికి ఏపాటి శక్తి ఉంటుంది ఇవన్నీ ఆలోచన చేయాల్సి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా అమరావతి తొలిదశ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దాని మీదనే పూర్తి స్థాయిలో ఫోకస్ నిలిపితేనే బాగుంటుంది అని అంటున్నారు. మొత్తానికి అమరావతి రాజధాని ఒక అద్భుత అవకాశంగా ఉండాలి తప్పించి పెను ఆర్ధిక భారంగా మారకూడదు అన్నది మేధావుల హెచ్చరికగా ఉంది.