మార్చి 15 : ఏపీ వాసులు ఈ డేట్ గుర్తు పెట్టుకోవాల్సిందే..
సుమారు 40 వేల కోట్లతో ఈ పనులు చేయనున్నారు. అదేవిధంగా మరో 11 పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నారని చెబుతున్నారు.
By: Tupaki Desk | 23 Feb 2025 1:30 AM GMTఏపీ చరిత్రలో వచ్చేనెల 15వ తేదీకి ఓ విశిష్టత దక్కింది. ఆ రోజు నుంచి రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డుగా ఉండటంతో రాజధాని పనుల టెండర్ల ప్రక్రియ మధ్యలో నిలిచిపోయింది. మార్చి 3తో కోడ్ ముగియనుండగా, రాజధాని పనులకు 15వ తేదీ మంచిదిగా ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులలో సింహాభాగం ఇప్పటికే సమకూరడంతో రానున్న మూడేళ్లలో పనులు పూర్తి చేసేలా పక్కా వ్యూహం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.
రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిపై ఓ స్పష్టత వచ్చింది. అదే సమయంలో పిచ్చిమొక్కలు పెరిగి చిట్టడవిలా మారిన రాజధాని ప్రాంతాన్ని ప్రభుత్వం పూర్తిగా మార్చింది. చెట్లను తొలగించి నీళ్లలో మునిగిపోయిన రాజధాని భవనాలను బయటకు తీసింది. ఇక పనులకు టెండర్లు పిలిచింది. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో వాటిని ఇంకా ఫైనల్ చేయలేదు. అయితే మార్చి 15 నుంచి పనులు మొదలయ్యేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఏప్రిల్ 1వ తేదీనాటికి రాజధాని పనులకు 30 వేల మంది కార్మికులను తీసుకురావాలని భావిస్తోంది.
రాజధానిలో కీలకమైన 62 పనులకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. సుమారు 40 వేల కోట్లతో ఈ పనులు చేయనున్నారు. అదేవిధంగా మరో 11 పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రాధాన్యాంశంగా రాజధాని నిర్మాణాన్ని భావిస్తున్నారు. మంత్రి నారాయణకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. దీంతో మంత్రి నారాయణ పర్యవేక్షణలో సీఆర్డీఏ అధికారులు రాజధాని టెండర్లు, వాటికి అనుమతులుపై రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు లేకుంటే ఇప్పటికే టెండర్లు ఖరారయ్యేవని చెబుతున్నారు. అయితే టెండర్ల ప్రక్రియకు అనుమతి ఇచ్చిన ఎన్నికల కమిషన్ వాటి ఆమోదంపై షరతులు విధించింది. దీంతో పనుల ప్రారంభం ఆలస్యమైందని అంటున్నారు. ఇక మరో వారం రోజుల్లో కోడ్ ముగియనున్నందున పనుల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసింది ప్రభుత్వం.