Begin typing your search above and press return to search.

చకచకా అమరావతి

గత రెండు రోజులుగా ఐకానిక్ టవర్ల పునాదుల్లో నిలిచిన నీటిని భారీ పంపు సెట్లతో తోడుతున్నారు.

By:  Tupaki Desk   |   26 Dec 2024 5:03 AM GMT
చకచకా అమరావతి
X

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఐదేళ్ల క్రితం నిలిచిన నిర్మాణ పనులు మళ్లీ మొదలుపెట్టేందుకు టెండర్లు పిలుస్తున్న ప్రభుత్వం.. పనులు చేపట్టేందుకు అనువుగా పునాదుల్లో నిలిచిన నీళ్లను తోడే ప్రక్రియను స్టార్ట్ చేసింది. గత రెండు రోజులుగా ఐకానిక్ టవర్ల పునాదుల్లో నిలిచిన నీటిని భారీ పంపు సెట్లతో తోడుతున్నారు.

2019కి ముందు తాత్కాలిక భవనాలను నిర్మించిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు రాజధానిలో శాశ్వత భవనాల నిర్మాణానికి చకచకా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులు తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వంలో శాశ్వత భవన నిర్మాణాలు కొనసాగించి ఉంటే ఈ పాటికే పూర్తయ్యేవి. కానీ, వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతిలో శాశ్వత భవనాల నిర్మాణాన్ని నిలిపేసింది. జూన్ లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ రాజధాని పనులపై ఫోకస్ చేసింది. ప్రపంచ బ్యాంకుతోపాటు ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు రుణం తీసుకుంది. ఈ నిధులతో జనవరి నుంచి పనులు మొదలుపెట్టాల్సివుంది. ముందుగా రాజధానిలోని సచివాలయం కోసం నిర్మిస్తున్న ఐదు ఐకానిక్ టవర్ పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో గతంలో ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేసిన ఐకానిక్ టవర్ల వద్ద నిలిచిన నీటిని తోడుతున్నారు.

అమరావతిలో శాశ్వత సచివాలయాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలని భావించిన టీడీపీ ప్రభుత్వం ఐదు టవర్లు నిర్మించాలని ప్రతిపాదించింది. ఒక్కో టవర్లో 40 నుంచి 50 అంతస్తులు ఉండేలా డిజైన్ చేసింది. ఈ పనులకు 2018 డిసెంబరు 27న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. డయా (రెండు వరుసల) గ్రిడ్‌ పద్ధతిలో ఐదు టవర్లను నిర్మించాలని అప్పట్లో ప్లాన్ చేశారు. అసెంబ్లీ భవన ప్రాంగణంలో 69.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ టవర్ల నిర్మాణానికి రూ.4,890 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మళ్లీ ఆరేళ్ల తర్వాత సరిగ్గా అదే సమయానికి ఇప్పుడు ముందస్తు పనులు మొదలు కావడం విశేషంగా చెబుతున్నారు.

భారీ భవనాలకు కీలకమైన పునాదుల నిర్మాణాన్ని అప్పట్లో రికార్డు సమయంలో పూర్తి చేశారు. మూడు రోజుల్లో, అంటే 72 గంటల్లో 10,816 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, నిర్మాణ సంస్థ అయిన నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ(ఎన్‌సీసీ) ఈ పనిని 66 గంటల్లోనే పూర్తిచేసింది. ఒక కార్యాలయం కోసం దేశంలో నిర్మించిన అతిపెద్ద రాఫ్ట్‌గా ఇది రికార్డులకెక్కింది. 13 అడుగుల లోతులో వేసిన ఈ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌కు ప్రపంచ ప్రఖ్యాత ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్‌ సంస్థ డిజైన్ చేసింది. షాపూర్జీ- పర్లోంజి సంస్థ ఆ రికార్డును సాధించింది. అయితే గత ఐదేళ్లు పనులు ముందుకు కదలకపోవడంతో ఈ ప్రఖ్యాత నిర్మాణం నీళ్లలో మునిగిపోయింది.

ఐఐటీ హైదరాబాద్‌ బృందం ఈ ఏడాది ఆగస్టులో నీటి లోపల ఉన్న పునాదులను పరిశీలించి పనులు కొనసాగించొచ్చని నివేదిక సమర్పించింది. దీంతో మళ్లీ టెండర్లు పిలిచిన ప్రభుత్వం మరో పక్క నుంచి పనులు చేపట్టేందుకు అనువుగా నీటిని తోడుతోంది. దీంతో కొద్ది రోజుల్లో అమరావతి పనుల్లో పురోగతి ఉంటుందని భావిస్తున్నారు.