Begin typing your search above and press return to search.

40 వేల‌ కోట్ల‌తో అమ‌రావ‌తి ప‌నులు.. ముహూర్తం రెడీ!

ఈ విష‌యాన్ని తాజాగా మంత్రి నారాయ‌ణ చెప్పుకొచ్చారు. ఈ నెల 12 నుంచి రాజ‌ధాని నిర్మాణ ప‌నులు ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిపారు.

By:  Tupaki Desk   |   9 March 2025 9:39 AM IST
40 వేల‌ కోట్ల‌తో అమ‌రావ‌తి ప‌నులు.. ముహూర్తం రెడీ!
X

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌నులు ప్రారంభం కానున్నాయి. గ‌త ఐదేళ్ల‌లో పాడుబ‌డిన‌ట్టుగా మారిన రాజ‌ధాని ప్రాంతాన్ని గ‌త 8 నెల‌లుగా శుభ్ర‌పరిచే కార్య‌క్ర‌మం చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. కూట‌మి స‌ర్కారు రాగానే అమ‌రావ‌తిని ప్రాధాన్యంగా పెట్టుకుని ప‌నులు చేప‌ట్టింది. అయితే.. కొన్ని కొన్ని ప్రాంతాలు చిట్ట‌డ‌విని త‌ల‌పించాయి. పైగా.. గ‌త ఐదేళ్ల‌లో ప‌ట్టించుకోక‌పోవ‌డంతో.. 5 అడుగుల మేర‌కు నీరు నిలిచిపోయి.. మ‌రికొన్ని ప్రాంతాలు చెరువులు, కుంట‌ల‌ను త‌ల‌పించాయి. దీంతో రూ.కోట్లు ఖ‌ర్చు చేసిన కూట‌మి స‌ర్కారు వాట‌న్నింటినీ బాగు చేయించింది.

ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే ఉన్న నిర్మాణాల నాణ్య‌త‌పైనా హైద‌రాబాద్ ఐఐటీ నిపుణుల‌ను తీసుకువ‌చ్చి ప‌రిశీల‌న‌లు చేయించింది. వీటిని అన్ని కోణాల్లోనూ ప‌రిశీలించిన నిపుణులు.. నాణ్య‌త ప‌రంగా నిర్మాణాలు బాగున్నాయ‌ని తెలిపారు. మున్ముందు కూడా ఎలాంటి ఇబ్బందులు లేవ‌న్నారు. పైగా రాజ‌ధాని కోసం వినియోగించిన స్టీల్, ఇసుక కూడా నాణ్యంగా ఉంద‌ని ఐఐటీ నిపుణులు స‌ర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన నిర్మాణాల‌ను య‌థాత‌ధంగా కొన‌సాగించేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. మ‌రోవైపు.. నూత‌న నిర్మాణాల‌కు కూడా ప్ర‌భుత్వం టెండ‌ర్లు పిలిచింది.

తాజాగా వీటిని ఈ నెల 10న ఖ‌రారు చేయ‌నున్నారు. అనంత‌రం.. 24 గంట‌ల్లోనే ప‌నులు చేప‌ట్టాల‌ని బిడ్డింగ్‌లో పాల్గొన్న అన్ని కంపెనీల‌కు ప్ర‌భుత్వం తేల్చి చెప్పింది. అంటే.. మొత్తంగా ఈ నెల 12 నుంచి రాజ‌ధాని ప‌నులు ప్రారంభం కానున్నాయి. ఈ విష‌యాన్ని తాజాగా మంత్రి నారాయ‌ణ చెప్పుకొచ్చారు. ఈ నెల 12 నుంచి రాజ‌ధాని నిర్మాణ ప‌నులు ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు చేప‌ట్టిన బిడ్డింగులో 20కి పైగా కంపెనీలు పాల్గొన్నాయ‌ని.. వీటికి రెండు రోజుల్లో టెండ‌ర్లు ఖ‌రారు చేయ‌నున్నామ‌ని వివ‌రించారు. అనంత‌రం 12వ తేదీన సీఎం చంద్ర‌బాబు చేతుల మీదుగా ప‌నులు పునః ప్రారంభం అవుతాయ‌ని వివ‌రించారు.

ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వంలో చేప‌డుతున్న ప‌నుల‌ను తొలి ద‌శ‌గా పేర్కొన్న మంత్రి నారాయ‌ణ‌.. ఈ ద‌శ‌లో 40 వేల కోట్ల రూపాయ‌ల‌తో ప‌నులు చేప‌ట్ట‌నున్న‌ట్టు తెలిపారు. వీటిలో మంత్రుల భ‌వ‌నాలు, క్యాపిట‌ల్ సిటీ, న్యాయ‌మూర్తులు,ఐఏఎస్ ల భ‌వ‌నాలు ఉన్నాయ‌ని తెలిపారు. సీడ్ క్యాపిట‌ల్‌లో ర‌హ‌దారులను కూడా నిర్మించ‌నున్న‌ట్టు వివ‌రించారు. ప‌నులు వేగంగా చేసేందుకు అంత‌ర్జాతీయ టెక్నాల‌జీని వినియోగించ‌నున్న‌ట్టు మంత్రి తెలిపారు. అన్ని ప‌నుల‌ను టైం బౌండ్‌లో చేప‌డ‌తామ‌ని వివ‌రించారు.