Begin typing your search above and press return to search.

భారీగా పెరగనున్న ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం?

రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ నిర్మాణానికి అయ్యే వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   5 Feb 2025 2:30 PM GMT
భారీగా పెరగనున్న ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం?
X

రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ నిర్మాణానికి అయ్యే వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఐదేళ్ల క్రితం నిర్మాణాలు నిలిచిపోవడం.. అప్పటి ధరలకు ప్రస్తుత ధరలకు చాలా వ్యత్యాసం ఉండటంతో ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం సుమారు 70 శాతం పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఐదేళ్లు 16 అడుగుల నీళ్లలోనే ఉండిపోయిన ఐకానిక్ టవర్ల పునాదులు ఎట్టకేలకు బయటకువచ్చాయి. నీటిని పూర్తిగా తోడేయడంతో ర్యాఫ్ట్ ఫౌండేషన్ ఒక రూపం సంతరించుకుంది.

మరోవైపు పనులు ప్రారంభానికి కొత్త ధరల ప్రకారం అంచనాలు తయారు చేస్తోంది సీఆర్టీడీఏ. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. రాజధాని పనుల కోసం ప్రపంచ బ్యాంకు సుమారు 15 వేల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. త్వరలో తొలి విడత డబ్బు అందుతుందని చెబుతున్నారు. దీంతో నిర్మాణ పనులకు అంచనాలు తయారు చేస్తున్నారు.

రాజధానిలో పరిపాలన విభాగం మొత్తం ఒకే చోట ఉండాలని 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం భావించింది. ఇందుకోసం ఐదు టవర్ల నిర్మాణానికి సంకల్పించింది. వీటిలో నాలుగు హెచ్ వోడీలకు మరొకటి జీఏడీకి ఉద్దేశించారు. పటిష్టమైన టవర్ల కోసం ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. అయితే 2019లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోవడంతో నిర్మాణాలు నిలిచిపోయాయి. ఐదేళ్లపాటు ఎలాంటి పనులు చేయకపోవడంతో నీళ్లు నిలిచిపోయాయి. ఈ నీటిని తోడే ప్రక్రియ గత ఏడాది డిసెంబర్ 25న మొదలుపెట్టగా, ఎట్టకేలకు ఓ కొలిక్కివచ్చింది.

2018లో ఐదు టవర్లు నిర్మాణానికి రూ. 2,703 కోట్లతో అంచనాలు తయారు చేశారు. మూడు ప్యాకేజీలుగా పనులను విభజించి టెండర్లు పిలిచారు. జీఏడీ టవర్ బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోన్ కాకుండా 47 అంతస్తులుగా నిర్మించాలని ప్లాన్ రెడీ చేశారు. మిగిలిన నాలుగు అంతస్తులను 39 అంతస్తులుగా డిజైన్ చేశారు. ఇవన్నీ డయా గ్రిడ్ నమూనాలో నిర్మిస్తుండటంతో సగానికి పైగా ఇనుము వినియోగించాల్సివుంది. అయితే 2018తో పోలిస్తే ప్రస్తుతం ఐరెన్ ధర 65 శాతం పెరిగిందని అంటున్నారు. దీనితోపాటు సిమెంట్, కూలీల ధరలు కూడా పెరిగాయి. ఫలితంగా నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. ప్రస్తుత రేట్లు ప్రకారం ఐకానిక్ టవర్ల కోసం రూ.4,687 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయం కూడా దాదాపు 33.8 శాతం పెరిగే అవకాశం ఉందంటున్నారు. కొత్త అంచనాలు త్వరలో కొలిక్కి రానున్నాయి. నెల రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తారని అంటున్నారు.

రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ నిర్మాణానికి వేసిన పునాదులు చెక్కు చెదరలేదు. ఐదేళ్లుగా పనులు నిలిచిపోయినా, 16 అడుగుల మేర నీళ్లలో నానినా పునాదులు పటిష్టంగా ఉండటంతో కూటమి ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. నిలిచిన పనుల స్థానే నిర్మాణాలు ప్రారంభానికి రంగం సిద్ధం చేస్తోంది.

రాజధాని అమరావతి పనుల్లో కీలకమైన సచివాలయ భవన నిర్మాణానికి చంద్రబాబు గత ప్రభుత్వంలో రాఫ్ట్ ఫౌండేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులకు బ్రేక్ పడింది. ఆ తర్వాత వర్షాలకు రాఫ్ట్ ఫౌండేషన్ నిండుగా నీరు చేరింది. అలా దాదాపు 16 అడుగుల లోతున ఐదేళ్ల పాటు నీళ్లు నిలిచిపోయాయి. దీంతో రాఫ్ట్ ఫౌండేషన్ ధ్రుడంగా ఉంటుందా? లేదా? అనే అనుమానాలు మొదలయ్యాయి. జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ రాజధాని పనులు స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా సచివాలయ భవనాల కోసం వేసిన రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నిలిచిన నీళ్లు తోడాలని నిర్ణయించింది.

భారీ మోటార్లతో డిసెంబర్ 25న నీళ్లు తోడే పని ప్రారంభించారు. సుమారు 24 రోజులపాటు నిర్విరామంగా నీళ్లు తోడగా, ఎట్టకేలకు జనవరి 19 ఆదివారం నీళ్లలోంచి పునాదులు పూర్తిగా బయటకు కనిపించాయి. సచివాలయం కోసం మొత్తం ఐదు టవర్లు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ వేయగా, ప్రస్తుతానికి 1, 2 బ్లాకుల రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తిగా బయటపడింది. నీరు మొత్తం తోడేసిన ఇంకా అడుగు మేర బురద ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక 3, 4, 5 బ్లాకుల్లో ఇంకా నీరు ఉంది. ఈ నీటిని తోడే పనిని ఇంకా కొనసాగిస్తున్నారు.

రాజధాని తలమానికంగా ఉండేలా రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించాలని 2018లో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. 40 నుంచి 50 అంతస్థులు ఉండేలా 5 టవర్ల కాంప్లెక్స్ నిర్మాణానికి అప్పట్లోనే శంకుస్థాపన చేశారు. 2018 డిసెంబర్ 7న పనులు ప్రారంభం కాగా, 2019 ఎన్నికల తర్వాత పనులు నిలిచిపోయాయి. దీంతో 16 అడుగుల మేర రాఫ్ట్ ఫౌండేషనులో నీళ్లు చేరాయి. ఈ నీటిని తోడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముంబైకి చెందిన నర్మదా ఆఫ్ షోర్ కన్ స్ట్రక్షన్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చింది. 8 భారీ మోటార్లను ఉపయోగించి 24 రోజులుగా నీటిని తోడుతున్నారు. ప్రస్తుతానికి 1, 2 టవర్లకు నీటి నుంచి విముక్తి కలగ్గా, 3, 4, 5, టవర్ల వద్ద నీటి ఊట సవాల్ విసురుతోంది. ఏదిఏమైనా రాఫ్ట్ ఫౌండేషన్ బలంగా ఉండటంతో రాజధాని పనులు పున: ప్రారంభానికి ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంటోంది.