Begin typing your search above and press return to search.

నవ్యాంధ్రలో అతిపెద్ద రైల్వేస్టేషన్.. చంద్రబాబు ప్లాన్ అదిరిపోయిందిగా..

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు చాలా డిఫరెంటుగా ఉంటాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకునే నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తుంటాయి.

By:  Tupaki Desk   |   7 April 2025 10:30 PM
నవ్యాంధ్రలో అతిపెద్ద రైల్వేస్టేషన్.. చంద్రబాబు ప్లాన్ అదిరిపోయిందిగా..
X

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు చాలా డిఫరెంటుగా ఉంటాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకునే నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇప్పటివరకు చంద్రబాబు దూరదృష్టితో తీసుకున్న అనేక నిర్ణయాలు సత్ఫలితాలనే ఇచ్చాయి. ప్రస్తుతం ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. నవ్యాంధ్ర రాజధానికి మణిహారంగా మరో భారీ ప్రాజెక్టును తలకెత్తుకున్నారు. అసలు రైల్వే లైనే లేని అమరావతికి ప్రత్యేక రైల్వే మార్గం వేయడంతోపాటు దేశంలో కెల్లా అతిపెద్ద రైల్వేస్టేషన్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రతిపాదనల్లో ఉన్న ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోందని అంటున్నారు.

ఎన్డీఏ ప్రభుత్వంలో రైల్వే స్టేషన్లను అధునాతనంగా నిర్మిస్తున్నారు. తెలంగాణలో చర్లపల్లి మోడల్ టెర్మినల్ తరహాలో దేశంలో చాలా రాష్ట్రాల్లో రైల్వేస్టేషన్లను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం దేశంలో ప్రయాగ్ రాజ్, వారణసీ, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్నినస్ రైల్వేస్టేషన్లు అత్యంత సుందరంగా నిర్మితమయ్యాయి. అయితే వీటికి దీటుగా నవ్యాంధ్రలో అతిభారీ రైల్వేస్టేషన్ నిర్మించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. రాజధాని అమరావతిలో నిర్మించే రైల్వేస్టేషన్ ను దేశంలోకెల్లా అతిపెద్దదిగా తీర్చిదిద్దాలని కేంద్రానికి ప్రతిపాదిస్తున్నారు. రాజధాని అమరావతి నగరానికి వెలుపల 1500 ఎకరాల్లో ఈ అతిభారీ రైల్వే స్టేషన్ కోసం భూమి అప్పగించేందుకు సీఎం సన్నాహాలు చేస్తున్నారు.

అమరావతి నగరానికి రోడ్డు, రైలు, వాయు, జల మార్గాలతో అనుసంధానించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం. అంతేకాకుండా ఆయా మార్గాలకు ఆధునికత అద్దాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజధాని అమరావతి పునాది దశలోనే ఉంది. కనీసం రైల్వేలైను కూడా లేదు. 2017-18లో కేంద్రం మంజూరు చేసిన రైల్వేలైన్ కాగితాల దశలోనే ఉండిపోయింది. గత ఏడాది బడ్జెట్ లో నిధులు కేటాయించడంతో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పనులు పట్టాలెక్కాయి. ఖాజీపేట-విజయవాడ సెక్షన్ పరిధిలోని ఎర్రుపాలెం నుంచి విజయవాడ-గుంటూరు సెక్షన్ లోని నంబూరు వరకు 57 కిలోమీటర్ల మేర కొత్త బ్రాడ్ గేజ్ సింగిల్ రైల్వే లైనుగా నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీనికోసం రూ.2,245 కోట్ల వ్యయం కానుంది. ఈ రైల్వేలైనుతో విజయవాడ, గుంటూరు, హైదరబాద్, చెన్నై నగరాలతో అమరావతి అనుసంధానం కానుంది.

అమరావతి రైల్వే స్టేషన్ ను విమానాశ్రయం తరహాలో నిర్మించాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదిస్తున్నారు. దీనికోసం ముందుగా రైల్వేలైన్ నిర్మించాల్సివున్నందున ఆ పనులు వేగవంతం చేయాలని రైల్వేశాఖను కోరారు. దీంతో రెండు నెలల్లో అమరావతి రైల్వే లైనుకు టెండర్లు పిలుస్తామని రైల్వేశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి వర్తమానం పంపిందని చెబుతున్నారు. మొత్తం 56.53 కిలోమీటర్ల లైనులో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి 27 కి.మీ. మొదటి దశలో చేపట్టనున్నారు. ఈ లైనులోనే క్రిష్ణా నదిపై సుమారు మూడు కిలోమీటర్ల మేర రైల్వే బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడతారు.