Begin typing your search above and press return to search.

అమరావతి 2.0.. ఈ సారి మోదీ ఏం ఇస్తారు?

రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   12 March 2025 2:01 PM IST
అమరావతి 2.0.. ఈ సారి మోదీ ఏం ఇస్తారు?
X

రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 2015లో రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. అయితే గత ఐదేళ్లలో పనులు సాగక, అమరావతి పనులు ఎక్కికక్కడే నిలిచిపోయాయి. దీంతో గత ఏడాది జూన్ నెలలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతి పనుల పునఃప్రారంభానికి రంగం సిద్ధం చేస్తోంది.

చంద్రబాబు 4.0 సర్కారులో రాజధాని నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. వచ్చే మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం నిధుల వేట మొదలుపెట్టి ఇప్పటివరకు దాదాపు 30 వేల కోట్లు సేకరించింది. ప్రపంచ బ్యాంకు రూ.15 వేల కోట్లు, హడ్కో 11 వేల కోట్లు, జర్మన్ బ్యాంకు మరో రూ.5 వేల కోట్లు రుణంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనూ అమరావతి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మొత్తంగా 64 వేల కోట్ల రూపాయలతో 73 పనులు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రచించింది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లు నేడో రేపో ఖరారు కానున్నాయి. దీంతో రాజధాని పనులను ఘనంగా పునః ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని ఆయన ఆలోచనగా చెబుతున్నారు. చంద్రబాబు 3.0 సర్కారులో అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2015 అక్టోబరులో జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే అప్పట్లో ప్రధాని హోదాలో అమరావతిపై వరాల జల్లు ప్రకటిస్తారని అంతా ఆశించారు. కానీ, ప్రధాని మోదీ గుప్పెడు మట్టి, చెంబుడు గంగాజలం ఇచ్చి వెళ్లిపోయారని విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రస్తుతం అమరావతి నిర్మాణానికి కేంద్రం బాగా సహకరిస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు.

కేంద్రం సహకారం వల్లే తక్కువ సమయంలో రూ.30 వేల కోట్లు సేకరించగలిగామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి పనుల పునఃప్రారంభానికి ముఖ్య అతిథిగా ప్రధానితోపాటు కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 30న ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని అంటున్నారు.