రాజధాని అమరావతికి ‘స్టార్’ లుక్
ప్రస్తుతం రాజధాని అమరావతి పరిధిలో పెద్ద హోటల్ ఒక్కటీ లేదు. తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో జాతీయ రహదారి పక్కన కొన్ని మెరుగైన హోటళ్లు మాత్రం ఉన్నాయి.
By: Tupaki Desk | 4 April 2025 4:30 PMఏపీ రాజధాని అమరావతికి అన్నీ మంచిరోజులే అంటున్నారు. ఇప్పటికే నిలిచిపోయిన పనుల పునఃప్రారంభానికి అడుగులు పడుతుండగా, ప్రైవేటు సంస్థలు వరుస పెట్టి వస్తున్నాయి. విద్యాసంస్థలు, ఆస్పత్రులు, కార్పొరేట్ కంపెనీలు ఇలా చాలా సంస్థలు అమరావతిలో భూమి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్ బ్యాంకులు కూడా రాజధాని అమరావతిలో స్పేస్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇదే సమయంలో ఆతిథ్య రంగం కూడా అమరావతిపై ఓ లుక్కేసింది. పది నెలలుగా అమరావతికి పెట్టుబడిదారులు, విదేశీ పర్యాటకులు, ఎన్ఆర్ఐల తాకిడి ఎక్కువ అవడంతో కొత్తగా హోటళ్లు ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు హోటల్ పరిశ్రమ ప్రకటించింది.
ప్రస్తుతం రాజధాని అమరావతి పరిధిలో పెద్ద హోటల్ ఒక్కటీ లేదు. తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో జాతీయ రహదారి పక్కన కొన్ని మెరుగైన హోటళ్లు మాత్రం ఉన్నాయి. అమరావతికి వస్తున్న వారంతా ఈ హోటళ్లలో బస చేయడమో లేక పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు వెళ్లడమో చేయాల్సివస్తోంది. అయితే ఈ సమస్య నివారణతోపాటు కొత్త రాజధానిలో భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకోడానికి హోటల్ పరిశ్రమ తహతహలాడుతోంది. అమరావతిలో 17 స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఆయా సంస్థలు ముందుకు వచ్చాయి. తాజాగా విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్ లో సమావేశమైన హోటల్ పరిశ్రమ యజమానులు కొత్త రాజధానిలో స్టార్ హోటళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు నిర్ణయించారు.
ప్రస్తుతం 17 హోటళ్ల యజమానులు తక్షణం నిర్మాణాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వం భూమి ఇవ్వడమే ఆలస్యమని, భూ కేటాయింపులు అవ్వగానే నిర్మాణాలకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఇలా రాజధానిలో హోటళ్ల నిర్మాణానికి ఆసక్తిగా ఉన్నవారిలో ఒబెరాయ్, తాజ్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయంటున్నారు. రాజధానిలో నవ నగరాలను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు క్వాంటం కంప్యూటర్స్, ఏఐ టెక్నాలజీ రంగాల్లో అమరావతిని దేశానికే రాజధాని చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో వచ్చే ఐదేళ్లలో ప్రముఖుల తాకిడి ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీంతో అమరావతిలో స్టార్ హోటల్స్ ఆవశ్యకత ఎంతైనా ఉందంటున్నారు.
ప్రభుత్వం కూడా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని విధాన నిర్ణయం తీసుకోవడం హోటల్ పరిశ్రమకు లాభిస్తుందని అంటున్నారు. తక్షణ అనుమతులు లభిస్తే వెంటనే నిర్మాణ పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నామని పలు స్టార్ హోటల్ యాజమాన్యాలు చెబుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని తమ ఆసక్తిని వ్యక్తీకరించాలని హోటల్ అసోసయేషన్ నిర్ణయించిందని అంటున్నారు.