అమరావతి కోసం కేంద్రంతో సీఆర్డీఏ మంతనాలు!
గత వైసీపీ ప్రభుత్వంలో అమరావతి రాజధానిని మాజీ ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 24 Jun 2024 4:30 PM GMTగత వైసీపీ ప్రభుత్వంలో అమరావతి రాజధానిని మాజీ ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి కూటమి ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో గెలిపించారు. ఈ నేపథ్యంలోనే అమరావతి పునర్నిర్మాణం కోసం ఏపీ సీఎం చంద్రబాబు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇక, ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కూడా అధికారం ఉండడంతో అమరావతి రాజధాని నిర్మాణం సత్వరంగా పూర్తి చేయడం కోసం కేంద్రం నుంచి కూడా చంద్రబాబు సహకారం తీసుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వ అధికారులు, సీఆర్డీఏ అధికారులు అమరావతి నిర్మాణంపై సంప్రదింపులు జరుపుతున్నారు. 2014-2019 మధ్యలో టీడీపీ హయాంలో పది నుంచి పదిహేను కేంద్ర సంస్థలకు అమరావతి ప్రాంతంలో భూములను కేటాయించారు. కానీ, నిర్మాణాలు జరగలేదు. తాజాగా మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ఈ ప్రాంతంలో తమ భవనాల నిర్మాణాలను ప్రారంభించేందుకు ఆయా సంస్థలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆ భూముల విషయంలో ఆయా సంస్థల ప్రణాళికలు చెప్పాలని సీఆర్డీఏ అధికారుల నుంచి ఆయా సంస్థలకు ఫోన్లు వెళ్ళాయని తెలుస్తోంది.
అయితే, అక్కడ స్థలాల పరిస్థితి తమకు చూపిస్తే నిర్మాణాలు ప్రారంభించేందుకు కొంతమంది కొన్ని సంస్థలు ప్రతినిధులు సూత్రప్రాయంగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. నాబార్డ్, ఎస్బిఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎల్ఐసి, ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్ వంటి సంస్థలు అమరావతిలో తమ కార్యాలయాల ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక, ఈ రోజు జరుగుతున్న తొలి క్యాబినెట్ భేటీ సందర్భంగా కూడా అమరావతి పునర్నిర్మాణంపై, ఇక్కడ సంస్థల ఏర్పాటుపై మంత్రివర్గంతో చంద్రబాబు చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని.
మరోవైపు, ఈరోజు నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అమరావతి కోసం కేంద్రంతోపాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధులు సేకరించి అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసేలా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మూడు ఫేజుల్లో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం లక్ష కోట్ల వరకు ఖర్చు చేయాలని అంచనా వేశారు. తొలిదశలో భాగంగా మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనివ్వనున్నారు. అందుకోసం, మొత్తం 38 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా.