తాడేపల్లిలో జగన్ ఇంటికి పూలబొకే.. పండ్లు తీసుకొని వెళ్లిన అమరావతి రైతులు
అయితే.. అక్కడే ఉన్న పోలీసులు మాత్రం వారిని జగన్ నివాసంలోకి వెళ్లేందుకు అనుమతించలేదు.
By: Tupaki Desk | 7 Jun 2024 5:21 AM GMTఅనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఎవరూ ఊహించని విధంగా అమరావతి రైతులు.. మహిళలు చేసిన గాంధీగిరి ఆశ్చర్యానికి గురి చేసింది. తాడేపల్లిలోని జగన్ నివాసానికి గురువారం సాయంత్రం వేళలో పూలబొకే.. పండ్లు.. మిఠాయిలు తీసుకొని వెళ్లారు. అయితే.. అక్కడే ఉన్న పోలీసులు మాత్రం వారిని జగన్ నివాసంలోకి వెళ్లేందుకు అనుమతించలేదు.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమను కలవటానికి ఇష్టపడలేదని.. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే మాత్రమేనని.. అలాంటప్పుడు ఆయన్ను కలిసేందుకు పోలీసులు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ ప్రశ్నించారు పలువురు మహిళలు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ గ్రామాల మీదుగా ప్రయాణించిన జగన్.. అప్పట్లో తమను కలవలేదని.. తమ వాదనను చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు.
రైతులు.. మహిళల మాటలకుఅక్కడున్న పోలీసు అధికారులు స్పందిస్తూ.. ఏంటి? హేళన చేయటానికి వచ్చారా? అంటూ సీరియస్ అయ్యారు. దీనికి వారు బదులిస్తూ.. తాము హేళన చేయాలని రాలేదని.. 29 గ్రామాల రైతులు.. మహిళలు ఏమీ చేయలేరని ఐదేళ్ల పాటు ఆయన వెటకారం చేయలేదా? మేం సాధించింది ఎమిటో చెప్పటానికే వచ్చామని.. తమను కలిసేందుకు అనుమతించాలని కోరారు. తాము నిరసన చేయటానికి రాలేదని.. తమ సంతోషాన్ని ఆయనతో పంచుకోవటానికి వచ్చామని పేర్కొన్నారు.
ఇప్పుడు జగన్ ఏమీ ముఖ్యమంత్రి కాదు కదా? ఆయన ఉత్త ఎమ్మెల్యేనే కదా? అలాంటప్పుడు ఆయన్ను కలవటానికి మీకున్న అభ్యంతరం ఏమిటి? అంటూ ప్రశ్నించారు. దీంతో.. మహిళా పోలీసులతో వారిని పక్కకు నెట్టేసి.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు. అయినా వారు కదలకపోవటంతో.. రెండు రోజుల్లో మాట్లాడి అపాయింట్ ఇప్పిస్తామంటూ పోలీసులు నచ్చచెప్పటంతో అమరావతిరైతులు.. మహిళలు వెనక్కి తిరిగారు. ఈ ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.