ఎవరు చేసినా ఈ పాడు పనిని తెలుగోళ్లంతా ఖండించాల్సిందే
ఏపీ రాజధాని అమరావతిగా శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని.. అక్కడ ఏర్పాటు చేసిన అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన వైనం షాకింగ్ గా మారింది.
By: Tupaki Desk | 18 April 2024 5:28 AM GMTకొన్ని తప్పులు ఎవరూ చేయకూడదు. అయినప్పటికీ ఆ పరిమితుల్ని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. తామేం చేసినా ఎవరో ఒకరు చూసుకుంటారన్న బలుపుతో వ్యవహరించే వారిని కఠినంగా శిక్షించాల్సిందే. ఈ తీరును రాజకీయాలకు అతీతంగా తప్పు పట్టాల్సిందే. అలాంటి మైండ్ సెట్ ను వ్యతిరేకించాల్సిందే. ఎవరు చేశారన్న దానిపై స్పష్టత లేదు కానీ.. ఏపీ రాజధాని అమరావతిగా శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని.. అక్కడ ఏర్పాటు చేసిన అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన వైనం షాకింగ్ గా మారింది.
అమరావతి మాస్టర్ ప్లాన్ తెలిపేలా ఏర్పాటు చేసిన మ్యూజియంలో నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాంటి మ్యూజియంను గుర్తు తెలియని వారు ధ్వంసం చేయటం.. అది కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా బయటకు రావటం హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ ఉద్దండరాయునిపాలెంకు వెళ్లారు.
ఆ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడే క్రమంలో.. మ్యూజియం గురించి ప్రస్తావన రావటం.. రాజధాని నిర్మాణం ఎలా ఉండనుందన్న విషయాన్ని తెలిపే త్రీడీ నమూనాను ఏర్పాటు చేశారు. అలాంటి కీలక మ్యూజియంలోని వాటిని ఎవరు ధ్వంసం చేశారు? ఎలా ధ్వంసం చేశారు? ఇప్పటివరకు ఎందుకు బయటకు రాలేదు? అన్నదిప్పుడు చర్చగా మారింది.
రాజధాని రహదారులు.. ఎల్ పీఎస్ లేఔట్లు.. భూగర్భ మూరుగునీటి పారుదల వ్యవస్థ.. భూగర్భ విద్యుత్తు.. తాగునీటి సరఫరా విధానాలు.. అమరావతి ప్రాంత చరిత్ర.. చారిత్రక నిర్మాణాలు.. ఆధునాతన రాజధాని కట్టడాలు.. అసెంబ్లీ.. సచివాలయం భవనాల్ని కళ్లకు కట్టినట్లుగా చూపే నమూనాలు.. బోర్డులు.. మ్యాపులతో కూడిన అన్నింటికి ఆ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అయితే.. కొన్నేళ్ల క్రితం నుంచి ఇందులోకి సందర్శకులకు అందుబాటులోకి ఉంచకుండా గ్యాలరీని మూసేశారు. భద్రతా సిబ్బందిని కూడా తీసేశారు.
దీంతో.. ఇక్కడి ప్రాంగణమంతా పిచ్చి మొక్కలకు అలవాలంగా మారింది. తాళం పగులగొట్టి మ్యూజియంలో ఉన్న వస్తువుల్ని.. త్రీడీ నమూనాల్ని పాడు చేయటంతో పాటు.. అద్దాల్ని పగలగొట్టిన వైనంతో పాటు.. గేట్లను కూడా పీకేయటం చేయటంతో పాటు.. ప్రతి వస్తువు మీదా తమ ప్రతాపాన్ని చూపినట్లుగా అక్కడి వాతావరణం ఉంది.రాజకీయాలు.. రాజకీయ విధానాలు.. ఎజెండా వేరుగా ఉండొచ్చు. అంత మాత్రాన ధ్వంసం చేయటం లాంటి వాటిని ఎటువంటి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు. దీనిపై వెంటనే చర్యలు షురూ చేయాల్సిన అవసరం ఉంది.