Begin typing your search above and press return to search.

ఆపరేషన్ అమరావతి: చంద్రబాబు ప్రమాణస్వీకారం వేళకు సిద్దం కావాలట

అయితే.. ఈ మొత్తాన్ని మార్చేయటంతో పాటు.. ఈసారి పదవీ కాలం పూర్తయ్యేసరికి అమరావతిని అసలుసిసలు రాజధాని షేప్ లోకి తీసుకొచ్చే దిశగా చంద్రబాబు ఆలోచనలు ఉన్నట్లుగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   9 Jun 2024 6:19 AM GMT
ఆపరేషన్ అమరావతి: చంద్రబాబు ప్రమాణస్వీకారం వేళకు సిద్దం కావాలట
X

ఆంధ్రుల రాజధానిగా సిద్దం చేసిన అమరావతి విషయంలో గత ప్రభుత్వం విధివిధానాలు ఎలా ఉన్నాయో తెలిసిందే. దీంతో.. గడిచిన ఐదేళ్లలో అమరావతి ప్రాంతం మొత్తం ఆగమాగమైంది. నిజానికి 2019 ఎన్నికలకు ముందే అమరావతి ప్రాంతంలో పలు అంతర్గత రోడ్లు మొదలు కొని పలు భవనాల్ని నిర్మించారు. సీడ్ క్యాపిటల్ కు సంబంధించిన పనులు ఒక దశకు చేరుకున్నాయి. అయినప్పటికీ.. అమరావతి అంటే యానిమేషన్ చిత్రాలుగా సాగిన తప్పుడు ప్రచారంతో అక్కడేమీ జరగలేదన్న భావన పలువురిలో కదిలింది.

ఆ తర్వాతి కాలంలో అమరావతిని రాజధానిగా మార్చటం కోసం చంద్రబాబు సర్కారు చేసిన ప్రయత్నాలు.. జరిగిన పనులు వెలుగు చూశాయి. అయితే.. గత ప్రభుత్వ ప్రాధామ్యాలు మారిపోవటంతో అమరావతి నిరాదరణకు గురైంది. ఐదేళ్ల కాలంలో అక్కడ వేసిన రోడ్లు చెడిపోవటంతో పాటు.. పిచ్చి మొక్కలతో పరిసరాలు నిండిపోయిన దుస్థితి. అంతేకాదు.. చంద్రబాబు హయాంలో నిర్మించిన ఐఏఎస్ అధికారులతో పాటు.. ఉద్యోగులకు అవసరమైన బహుళ అంతస్తుల భవనాలు.. జ్యుడిషియల్ క్వార్టర్స్.. ప్రభుత్వ టైప్ 1.. టైప్ 2 భవనాలు.. శాశ్విత రాజధాని నిర్మాణ పనుల్లో భాగమైన జీఏడీ మెగా టవర్లు మొత్తం పిచ్చి మొక్కలతో కమ్మేశాయి.

అయితే.. ఈ మొత్తాన్ని మార్చేయటంతో పాటు.. ఈసారి పదవీ కాలం పూర్తయ్యేసరికి అమరావతిని అసలుసిసలు రాజధాని షేప్ లోకి తీసుకొచ్చే దిశగా చంద్రబాబు ఆలోచనలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా.. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటానికి ముందే.. అమరావతి మొత్తాన్ని ఐదేళ్ల క్రితం ఏ రీతిలో ఉంచామో.. అలాంటి పరిస్థితికి తీసుకురావాలన్న మిషన్ ను ఆదేశించారు.

దీంతో.. అమరావతిని ఐదేళ్ల క్రితం ఏ రీతిలో ఉందో.. అలా సిద్ధం చేయటానికి అధికారులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. విజయవాడ నుంచి అమరావతిలోకి ప్రవేశించే కరకట్ట రోడ్డు.. అత్యంత ప్రధానమైన సీడ్ యాక్సెస్ రోడ్డు.. హైకోర్టు నుంచి తుళ్లూరుకు వెళ్లే మార్గంతో పాటు అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ లో భాగంగా నిర్మించిన రోడ్లతో పాటు. ఇతర భవనాల వద్ద పెరిగిపోయిన పిచ్చి చెట్లనుయుద్ధ ప్రాతిపదికన తొలిగిస్తుండటం గమనార్హం.

రాజధాని నిర్మాణ పనుల్లో భాగంగా నిర్మించిన గ్యాడ్ టవర్లు చెరువుల్ని తలపించేలామారటంతో.. అందులో చేరిన నీటిని మోటార్ల సాయంతో బయటకు వదిలేస్తున్నారు. ప్రమాణస్వీకారానికి ముందుగా పిచ్చిచెట్ల వనాన్ని పూర్తిగా మార్చేస్తారని.. ఇంతకాలం గాలికి వదిలేసిన ఎక్స్ పీరియన్స్ సెంటర్ తాళాలు తెరిచి.. దాన్ని పూర్వ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతికి శంకుస్థాపన చేసిన ఉద్దండ్రాయునిపాలెంలోని పరిసరాల్ని సైతం శుభ్రం చేస్తున్నారు. ఈ మొత్తం పనుల్ని బాబు ప్రమాణస్వీకారం చేసిన రోజుకు పూర్తి చేయటమే లక్ష్యంగా పని చేస్తున్నారు.