అమరావతే రాజధాని.. కుండబద్దలు కొట్టిన కేంద్రం!
అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం విశాఖను పాలన రాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా, అమరావతిని కేవలం శాసన రాజధానిగానే పేర్కొంటూ.. తీర్మానం చేసింది.
By: Tupaki Desk | 4 Dec 2023 4:37 PM GMTఏపీ రాజధాని ఏది? అంటే.. సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. మూడు రాజధానుల జపం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు రాజధాని లేకుండా పోయింది. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రానికి నడిబొడ్డున కృష్ణానది ఒడ్డున ఉంటుందన్న ఉద్దేశంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. రైతుల నుంచి 33 వేల ఎకరాలను తీసుకుని.. నవ నగరాలను ఏర్పాటు చేసింది. సచివాలయం సహా హైకోర్టును తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసింది. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ కూడా 2015లో దీనికి శంకు స్థాపన చేశారు. అయితే.. అనూహ్యంగా వైసీపీ వచ్చాక మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చింది.
కానీ, దీనిని వ్యతిరేకిస్తూ.. రాజధాని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. పాదయాత్రలు చేశారు. కేంద్రానికి విన్నవించారు. ప్రజాసంఘాలను సంఘటితం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని రగిలించారు. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం విశాఖను పాలన రాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా, అమరావతిని కేవలం శాసన రాజధానిగానే పేర్కొంటూ.. తీర్మానం చేసింది. దీనిపై న్యాయ పోరాటం కూడా జరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. అయితే.. అనేక సందర్భాల్లో కేంద్రం పార్లమెంటులో అమరావతినే రాజధానిగా పేర్కొంది. అంతేకాదు.. మూడు రాజధానుల ప్రతిపాదన తమ వద్దకు రాలేదని తెలిపింది.
తాజాగా మరోసారి కూడా. . కేంద్రం ఇదే విషయాన్ని స్ఫస్టం చేసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో రాజధానుల విషయాన్ని కొందరు సభ్యులు ప్రశ్నించారు. దీనిపై సమాధానం ఇచ్చిన కేంద్ర సహాయ మంత్రి కౌశల్ కిషోర్ సంచలన ప్రకటన చేశారు. దేశంలోని 28 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉందని తెలిపారు. అదేవిధంగా ఏపీకి సంబంధించి రాజధాని అమరావతికి సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా కేంద్ర వద్ద ఉందని చెప్పారు. అంతేకాదు.. అమరావతి మాస్టర్ ప్లాన్‌ను కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించిందని వెల్లడించారు.
దీంతో ఏపీ రాజధాని అమరావతి అనే ప్రతిపాదన అలానే ఉందని.. దీనిలో ఎలాంటి మార్పూ లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసినట్టు అయింది. ఇదిలావుంటే.. మరోవైపు ఏపీ సీఎం జగన్ ఈ నెల 8న విశాఖపట్నంలోని రుషికొండలో నిర్మించిన కొత్త భవనాలకు వెళ్లిపోతున్నారు. ఆయనతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా వెళ్లిపోతున్నారు. వారికి సంబంధించి అక్కడ విలాసవంతమైన భవనాలను కూడా అద్దెకు తీసుకున్నారు. మరి ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు నాలుగు మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా రానుండడం గమనార్హం.