మూడేళ్ళలో అమరావతి వైభవం
ఈ పనులకు సంబంధించిన నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు.
By: Tupaki Desk | 9 March 2025 5:00 AM ISTఏపీ రాజధాని అమరావతికి అదిరిపోయే వార్త ఒకటి ప్రకటించారు మంత్రి నారాయణ. అమరావతి రాజధాని పనులు ఈ నెల 12 నుంచి 15 తేదీల మధ్యలో మొదలవుతాయని ఆయన తెలియజేశారు. ఈ పనులకు సంబంధించిన నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు.
నిర్మాణం పనులకు మంచి ముహూర్తాన్ని ఖరారు చేస్తున్నామని ఆయన చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన అమరావతి పనులు సాగుతాయని ఆయన చెప్పారు. కేవలం మూడేళ్ళ వ్యవధిని తీసుకుని మొత్తం మొదటి దశ పనులు కంప్లీట్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ పనులను ఏకంగా 40 వేల కోట్ల రూపాయలతో ప్రారంభిస్తున్నారు. ఈ పనులకు సంబంధించిన ఆర్ధిన వనరులను వివిధ మార్గాల ద్వారా సేకరించుకున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. ప్రజల నుంచి పన్నులు కట్టిన దానిని అమరావతి రాజధాని కోసం మళ్ళించడం లేదని నారాయణ స్పష్టం చేశారు.
మరో వైపు చూస్తే వైసీపీ రాజధానుల విషయంలో ఒక స్టాండ్ లేకుండా కేవలం విమర్శలు చేయడానికే చూస్తోందని మంత్రి మండిపడ్డారు. వైసీపీకి మూడు ముక్కలాట విధానమని తమది నిర్మాణాత్మక పంధా అని ఆయన అన్నారు. ఇక చూస్తే కనుక 2025 మార్చిలోనే అమరావతి నిర్మాణం పనులు తొలిదశను మొదలుపెట్టడం ద్వారా కూటమి ప్రభుత్వం తన ప్రయారిటీ ఏంటో చెప్పకనే చెప్పింది.
అంతే కాదు చేతిలో మరో నాలుగేళ్ళకు పైగా అధికారంలో ఉన్న వేళ అమరావతి పనులకు శ్రీకారం చుట్టింది. అది కూడా కచ్చితంగా మూడేళ్ళ కాల వ్యవధిని పెట్టుకుని మరీ రంగంలోకి దిగుతోంది. ఎటూ కేంద్రం నుంచి సానుకూల వాతావరణం ఉంది. ప్రభుత్వం కూడా ప్రాధాన్యత ఇస్తోంది. కాబట్టి అమరావతి తొలిదశ పనులు అనుకున్నట్లుగా పూర్తి అయితే 2028 నాటికే అమరావతి వైభవాన్ని చూడవచ్చు అని అంటున్నారు.
అదే కనుక జరిగితే 2029 ఎన్నికలలో టీడీపీ కూటమి మరో మారు అధికారంలోకి రావడానికి అమరావతి అతి పెద్ద అండగా నిలుస్తుందని అంటున్నారు. ఈ టెర్మ్ లో తొలిదశ పనులు పూర్తి చేస్తే మరోసారి గెలిచి మలిదశ పనులు పూర్తి చేయడానికి కూడా ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుంది. ఈ తొలిదశ పనులు పూర్తి అయితే ప్రైవేట్ ప్రాజెక్టులు కూడా పెద్ద ఎత్తున వచ్చి అమరావతిలో సెటిల్ అవుతాయి. మొత్తంగా చూస్తే అమరావతి అద్భుతాన్ని మరో మూడేళ్ళలో కళ్ళ ముందు ఆవిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నాలనే చేస్తోంది. గతానుభవాల దృష్ట్యా అమరావతిని ఏ విధంగానూ వేగం తగ్గించకుండా పరుగులు పెట్టించాలనే చూస్తున్నారు.