పెందుర్తి నుంచి మంత్రి గుడివాడ పోటీ...!?
అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ అమర్నాథ్ సీటుని అధినాయకత్వం వేరొకరికి ఇచ్చేసింది.
By: Tupaki Desk | 8 Jan 2024 3:58 AM GMTఅనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ అమర్నాథ్ సీటుని అధినాయకత్వం వేరొకరికి ఇచ్చేసింది. మలసాల భరత్ కుమార్ ని అనకాపల్లి ఇంచార్జిగా చేసింది. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం ఖాయం అయింది. మరి గుడివాడ అమరానాధ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న చర్చ అయితే సాగుతోంది.
అనకాపల్లి నుంచి 2014లో ఎంపీగా 2019లలో ఎమ్మెల్యేగా పోటీ చేసి పదేళ్ల పాటు అనుబంధం పెంచుకున్న గుడివాడ భరత్ ని క్యాడర్ కి పరిచయం చేసే కార్యక్రమంలో ఎమోషన్ అయ్యారు. తనకు అనకాపల్లి రాజకీయ జన్మ ఇచ్చింది అని ఆయన కన్నీటి పర్యతం అయ్యారు.
అయితే ఆ మరుసటి రోజే విశాఖ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అమర్నాథ్ ఇంటికి వెళ్ళి ఆయనకు భరోసా ఇచ్చారు. జగన్ కి గుడివాడ అంటే ప్రత్యేక అభిమానం అని ఆయనకు తగిన విధంగా న్యాయం చేస్తారు అని కూడా హామీ ఇచ్చారు.
అనకాపల్లి నుంచి ఎంపీగా గుడివాడ పోటీ చేస్తారు అని ఒక చర్చ సాగింది. కానీ ఇపుడు సామాజిక సమీకరణల నేపధ్యంలో గవర సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్ ఇస్తారు అని అంటున్నారు. ఎందుకంటే అనకాపల్లి అసెంబ్లీకి భరత్ కుమార్ ఉన్నారు. ఆయన కాపు సామాజిక వర్గం నేత.
అదే సామాజికవర్గానికి చెందిన గుడివాడకు ఎంపీ టికెట్ ఇవ్వరని అంటున్నారు అదే విధంగా చోడవరం నుంచి గుడివాడ పోటీ చేస్తారు అని వార్తలు వచ్చాయి కానీ చోడవరంలో కరణం ధర్మశ్రీ బలంగా ఉన్నారు. ఆయన బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన వారు. అందువల్ల మరోసారి ఆయనే పోటీ చేస్తారు అని అంటున్నారు.
ఇక మిగిలింది పెందుర్తి సీటు అని అంటున్నారు. పెందుర్తి నునిచ్ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఉన్నారు. ఆయన పనితీరు మీద సర్వే నివేదికలు వ్యతిరేకంగా వచ్చాయి. పైగా భూ ఆరోపణలు కూడా ఎమ్మెల్యే అనుచరుల మీద ఉన్నాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తులో భాగంగా జనసేన నేత పంచకర్ల రమేష్ బాబును ఇక్కడ నుంచి పోటీ చేయించబోతున్నారు అని అంటున్నారు
ఆయన కాపు సామాజికవర్గానికి చెందిన నేత. దాంతో అదే సామాజిక వర్గానికి చెందిన గుడివాడను దించితే పెందుర్తి వైసీపీ పరం అవుతుంది అని అధినాయకత్వం భావిస్తోంది అంటున్నారు. వైసీపీ విడుదల చేయబోయే ఫైనల్ జాబితాలో గుడివాడకు పెందుర్తి కేటాయించవచ్చు అని అంటున్నారు. ఈ విషయం మీదనే గుడివాడకు హామీ దక్కింది అని అంటున్నారు. గుడివాడ తాత తండ్రి ఇద్దరూ కూడా గతంలో పెందుర్తి నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేశారు. అలా కూడా గుడివాడకు ఈ సీటు సెంటిమెంట్ గా కలసివస్తుందని భావిస్తున్నారు