Begin typing your search above and press return to search.

అమెజాన్ లో.. అరుదైన మష్కో పిరో.. మన సెంటినలీస్ లా ముప్పు అంచున

ఐదారేళ్ల కిందట అండమాన్ దీవుల్లోని సెంటినలీస్ తెగకు సంబంధించిన కథనాలు పెద్దఎత్తున వచ్చాయి.

By:  Tupaki Desk   |   18 July 2024 11:30 PM GMT
అమెజాన్ లో.. అరుదైన మష్కో పిరో.. మన సెంటినలీస్ లా ముప్పు అంచున
X

ఐదారేళ్ల కిందట అండమాన్ దీవుల్లోని సెంటినలీస్ తెగకు సంబంధించిన కథనాలు పెద్దఎత్తున వచ్చాయి. అమెరికన్ ఒకరు ఈ దీవిలో దిగి.. ప్రాణాలు కోల్పోయిన సంగతి సంచలనం రేపింది. సెంటినలీస్ ఎంతటి ప్రమాదకారులో చెప్పే ఉదంతాలు అనేకం ఆ సందర్భంగా తెలిసింది. అయితే, వీరు అత్యంత అరుదైన జాతి. సంఖ్య కూడా అతి స్వల్పం. మరోవైపు సెంటినలీస్ అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నారు. నాగరిక ప్రపంచానికి దూరంగా బతికే వీరంతా కొత్త వ్యక్తి ఎవరైనా సరే తమ ద్వీపంలో అడుగుపెడితే బతకనీయరు. ఇలాంటి సెంటినలీస్ తెగకు దగ్గరగా ఉన్నవారే మష్కో పిరో తెగ. దక్షిణ అమెరికా ఖండం పెరూలోని అమెజాన్ అటవీ ప్రాంతాలు వీరి ఆవాసం. వీరిని అక్కడినుంచి తరిమేస్తున్నారనే ఆందోళనలు మొదలయ్యాయి. ఈ మేరకు ఫొటోలు బయటపడ్డాయి.

అంత పెద్ద అమెజాన్ లో

అమెజాన్ అంటే.. అతి పెద్ద అడవి. మొత్తం ప్రపంచానికే ఊపిరితిత్తులు. అంత పెద్ద అమెజాన్ లోని పెరూ దేశంలో ఉంది మష్కో పిరో తెగ. తాజాగా వీరి వీడియోలు, ఫొటోలను సర్వైవల్‌ ఇంటర్నేషనల్‌ అనే సంస్థ విడుదల చేసింది. నదీ తీరంలో ఉన్న మష్కో పిరోలు ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇదే సమయంలో వారి మనుగడపై కూడా ఆందోళన మొదలైంది. మష్కో పిరోలను సొంత భూముల నుంచి నెట్టేశారంటూ ఆదివాసీ జాతుల హక్కుల సంస్థ ఫెనామాడ్‌ ఆరోపిస్తోంది. అడవి బిడ్డలైన వారు గూడు కోల్పోయి ఆహారం, కొత్త ఆవాసం కోసం సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారని చెబుతోంది. ఈ ఫొటోలు, వీడియోలు దక్షిణ పెరూ- బ్రెజిల్‌ సరిహద్దు వద్ద జూన్‌ లో మాడ్రే డె డియోస్‌ నది వద్ద తీసినవి. ఇందులో 50 మంది మాష్కో పిరోలు తీరంలో కనిపించారు. అడవి నరికివేసిన ప్రాంతానికి ఇది కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉందని సమాచారం.

మాష్కో పిరో జాతి మాడ్రే డె డియోస్‌కు చెందిన రెండు పరీవాహక ప్రాంతాల మధ్యే జీవిస్తారు. వీరు చాలా అరుదుగా మాత్రమే బాహ్య ప్రపంచానికి కనిపిస్తారు. స్థానిక యిన్‌ ప్రజలతోనూ వీరికి సంబంధాలు లేవు. అయితే, వారుండే చోట అటవీ కలప కాంట్రాక్ట్‌ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ట్రక్కుల రాకపోకలకు 200 కిలోమీటర్ల మేర రోడ్లు వేసిందని సమాచారం. ఈ సంస్థ మాడ్రే డె డియోస్‌ అటవీ ప్రాంతంలో 1.30 లక్షల ఎకరాల్లో దేవదార్‌, మహోగని చెట్లను నరికేందుకు అనుమతులు పొందిందని.. అందుకే మాష్కో పిరోలను తరిమేస్తున్నారనే కథనాలు వస్తున్నాయి.