ట్రంప్ తో అంబానీ దంపతులు... 100 మందిలో ఇద్దరేనా?
అమెరికాకు కాబోయే అధ్యక్షుడితో ముకేష్ అంబానీ దంపతులు సమావేశమైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By: Tupaki Desk | 20 Jan 2025 5:33 AM GMTఅగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల అధినేతలు, ప్రతినిధులు, బడా వ్యాపారవేత్తలు, వివిధ రంగాల సెలబ్రెటీలు హాజరు కానున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ముకేష్ అంబానీ.. డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు!
అవును... మరికొన్ని గంటలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతోన్న డొనాల్డ్ ట్రంప్ తో ప్రపంచ కుబేరుల్లో ఒకరు, భారత కుబేరుల్లో అగ్రజుడు, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా... అమెరికాకు కాబోయే అధ్యక్షుడితో ముకేష్ అంబానీ దంపతులు సమావేశమైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వాస్తవానికి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో... ఈ అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు జనవరి 18న అంబానీ దంపతులు అమెరికాకు చేరుకున్నారని అంటున్నారు. ఈ సమయంలో.. డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన క్యాండిల్ లైట్ డిన్నర్ లో వీరువురూ పాల్గొన్నారని అంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 100 మందికి ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ కు ఆహ్వానం అందగా.. ఆ జాబితాలో భారత్ నుంచి వీరిద్దరే ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో.. ఈ విషయం మరింత వైరల్ గా మారింది. అయితే... వీరి భేటీలో ఏయే విషయాలు చర్చకు వచ్చాయనే విషయాలు మాత్రం తెరపైకి రాలేదు. దీనిపై రిలయన్స్ ఫౌండేషన్ స్పందించింది.
ట్రంప్ తో ముకేశ్ అంబానీ దంపతుల భేటీపై రిలయన్స్ ఫౌండేషన్ స్పందించింది. ఇందులో భాగంగా... వాషింగ్టన్ లో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు విందులో డొనాల్డ్ ట్రంప్ తో ముకేశ్ అంబానీ దంపతులు భేటీ అయ్యారని.. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు వీరిద్దరూ ట్రంప్ కు శుభాకాంక్షలు చెప్పారని పేర్కొంది.