Begin typing your search above and press return to search.

'ఓటమిని ఒప్పుకోవాలి'... 2024 ఫలితాలపై అంబటి ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇందులో భాగంగా.. కొంతమంది లిక్కర్ పాలసీ వల్ల అంటే.. మరొకరు భూచట్టం వల్ల అని అన్నారు.. ఇంకొకరు చంద్రబాబు రెట్టింపు పథకాలు ఇస్తానన్న హామీని నమ్మారని తెలిపారు.

By:  Tupaki Desk   |   31 Jan 2025 6:30 PM IST
ఓటమిని ఒప్పుకోవాలి... 2024 ఫలితాలపై అంబటి ఆసక్తికర వ్యాఖ్యలు!
X

ఏపీలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఫలితాలపై వైసీపీ నేతలు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. కొంతమంది లిక్కర్ పాలసీ వల్ల అంటే.. మరొకరు భూచట్టం వల్ల అని అన్నారు.. ఇంకొకరు చంద్రబాబు రెట్టింపు పథకాలు ఇస్తానన్న హామీని నమ్మారని తెలిపారు.

మరికొంతమంది అయితే.. ఈవీఎం ల మేనిప్యులేషన్ అని చెప్పుకొచ్చారు. ఇలా తమ ఓటమిపై వైసీపీ నేతలు రకరకాల కారణాలు చెప్పారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... 'ఘోరంగా ఓడిపోయాం.. ఒప్పుకోవాలి' అని అన్నారు.

అవును... తాజాగా అనకాపల్లిలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించిన అంబటి రాంబాబు... "మనం గెలుస్తాం అనుకున్నాం.. మళ్లీ తిరిగి ఈ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుంది.. జగన్ రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని భావించాం.. కానీ, ఓటమి పాలయ్యాం. ఓడిపోతే ఓడిపోయాం..!"

"చాలా ఘోరంగా ఓడిపోయాం.. ఒప్పుకోవాలి.. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్నాం.. 164 సీట్లు వారు గెలుచుకున్నారు. మన ఎవరికీ అర్ధం కాలేదు.. మనకు 11 మాత్రమే వచ్చాయేమిటని మనకు అర్ధం కాలేదు.. మనకు అర్ధం కాకపోతే అర్ధం కాకపోయింది.. 164 సీట్లు వాళ్లకెందుకు వచ్చాయో వాళ్లకూ అర్ధం కావడం లేదు".

"అంటే ఏమి జరిగింది?.. ఇద్దరు ముగ్గురు కలవడంతో బలం పెరిగిందా?.. లేక, మనకు తెలియని వ్యతిరేకత ఏమైనా ఉన్నదా?.. లేక, ఏదైనా మాయ జరిగిందా?.. అనెటువంటి అనుమానాలు మన మనసుల్లో ఉన్నాయి! ఏది ఏమైనా... ఓటమి పాలయ్యాం. పంటసరిగా పండలేదు.. మళ్లీ వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది"!

"జగన్ మోహన్ రెడ్డి 175 సీట్లలో 25 పార్లమెంట్ సీట్లలో మళ్లీ ఏ విధంగా గెలుచుకోవాలనే టార్గెట్ తో ఇవాళ అన్నీ కూడా సక్రమంగా పునర్నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తున్నాం మనం. ఎవరు ఉన్నారు.. ఎవరు బయటకు పోయారు.. ఎవరు పారిపోయారు అన్నీ తెలుసుకుంటున్నారు!" అని అంబటి రాంబాబు తెలిపారు.