అంబటి గారు తిరుపతిలో ఇదేం పనండి బాబు..?
మాజీ మంత్రివర్యులు అయిన అంబటి రాంబాబు గారికి తిరుమలలో ఇలా చేయకూడదని తెలియదా అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా ఆయన ఫోటోలను షేర్ చేసి విమర్శలు చేస్తున్నారు.
By: Tupaki Desk | 4 Nov 2024 1:40 PM GMTతిరుమల కొండపై ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన పోస్టర్‌లు కానీ, మత ప్రచారంకు సంబంధించిన పోస్టర్ లను ప్రదర్శించడం కానీ చేయకూడదు. రాజకీయ పార్టీ చిహ్నాలు సైతం ప్రదర్శించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ మాజీ మంత్రి, వైకాపా ముఖ్యనేత అంబటి రాంబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమయంలో జగన్ ఫోటో ఉన్న బ్యాడ్జ్ ను చొక్కాకు ధరించడం వివాదాస్పదం అయింది. మాజీ మంత్రివర్యులు అయిన అంబటి రాంబాబు గారికి తిరుమలలో ఇలా చేయకూడదని తెలియదా అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా ఆయన ఫోటోలను షేర్ చేసి విమర్శలు చేస్తున్నారు.
తమ పార్టీ అధినేత అయిన వైఎస్ జగన్ పై అంబటి రాంబాబుకు స్వామి భక్తి ఉండవచ్చు. కానీ శ్రీవారి వద్దకు వచ్చినప్పుడు ఇలాంటివి చేయకూడదు కదా అంటూ కొందరు ఆయనకు హితవు పలుకుతున్నారు. మొత్తానికి సోషల్ మీడియా వేదికగా అంబటి రాంబాబును తీవ్రంగా విమర్శిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అదే సమయంలో ఆయకు మద్దతుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆయన షర్ట్ కి స్టికర్ ను అప్పటికప్పుడు అంటించుకోలేదు... అంతకు ముందే ఆ స్టికర్ ఉందని అన్నారు. అయినా ఆ స్టిక్కర్ కనిపించకుండా అంబటి రాంబాబు టవల్ కవర్ చేశారని అంటున్నారు.
తెలుగు దేశం పార్టీకి చెందిన వారు కొందరు కావాలని ఈ విషయాన్ని వివాదాస్పదం చేయాలని చూస్తున్నారు. అంబటి రాంబాబుకు తిరుమల గౌరవం ను తగ్గించే ఉద్దేశ్యం లేదని, ఆయన ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి చేయడని, ఆయన కొండపై రాజకీయాల గురించి మాట్లాడలేదని ఆయన సన్నిహితులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయమై అంబటి రాంబాబు ఎలాంటి వివరణ ఇస్తారు అనేది చూడాలి. ఈ విషయం పై టీటీడీకి తెలుగు దేశం పార్టీ నాయకులు ఫిర్యాదు ఇస్తారా అనే చర్చ సైతం జరుగుతోంది.
టీటీడీ నిబంధన ప్రకారం రాజకీయ పార్టీకి చెందిన స్టికర్ ను జేబుకు తగిలించుకుని శ్రీవారి దర్శనంకు రావడం అనేది తప్పు. కనుక అంబటి రాంబాబు చేసిన తప్పుకు ఎలాంటి శిక్ష విధిస్తారు అనేది చెప్పాలంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు, సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసే విషయమై ఆలోచిస్తున్నారట. మొత్తానికి ఈ విషయాన్ని సీరియస్‌గా తెలుగు తమ్ముళ్లు తీసుకుంటే అంబటి రాంబాబుకు చిక్కులు తప్పవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.