Begin typing your search above and press return to search.

జగన్ - షర్మిల ఆస్తుల వ్యవహారం... "బాణం"తో రాంబాబు ఎంట్రీ!

నేరం నాది కాదు మా అన్నదే అంటూ తన వెర్షన్ వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 Oct 2024 2:13 PM
జగన్ - షర్మిల ఆస్తుల వ్యవహారం... బాణంతో రాంబాబు ఎంట్రీ!
X

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ - ఆయన సోదరి షర్మిల మధ్య జరుగుతున్న ఆస్తులకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై షర్మిల వరుస ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. నేరం నాది కాదు మా అన్నదే అంటూ తన వెర్షన్ వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

తనపై వస్తోన్న ఆరోపణలపై వైఎస్సార్ అభిమానులకు 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. వైఎస్ అభిమానులకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే ఈ లేఖ రాసినట్లు చెప్పుకొచ్చారు. ఆస్తులు కావాలనే కోరిక తనకు లేదని.. తన బిడ్డలకు ఆస్తులు చెందాలన్న వైఎస్సార్ అభిమతం మేరకే ఈ ప్రయత్నమన్నట్లుగా చెప్పుకొచ్చారు.

మరోపక్క వైసీపీ నేతలు వరుసగా మైకుల ముందుకు వస్తున్నారు. షర్మిల వ్యాఖ్యలు ఖండిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ పాత్ర టైపు జగన్ అయితే... వీరశివారెడ్డి సినిమాలో అన్న చావు కోరే వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర టైపు షర్మిళ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇందులో భాగంగా... ఇప్పటికే మాజీమంత్రి పేర్ని నాని, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇవ్వగా.. సోషల్ మీడియా వేదికగా కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో వాస్తవాలు ప్రజలకు వివరించాలంటూ పార్టీ శ్రేణులకు సజ్జల సూచించారు. ఈ నేపథ్యంలో తాజాగా అంబటి రాంబాబు స్పందించారు.

అవును... జగన్ వర్సెస్ షర్మిల అన్నట్లుగా సాగుతున్న వ్యవహారంలో మాజీమంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా... "నాడు జగనన్న వదిలిన బాణం.. నేడు చంద్రన్న వదిలిన బాణం!" అంటూ స్పందించారు. దీంతో... కామెంట్ సెక్షన్ లో వైసీపీ వర్సెస్ యాంటీ వైసీపీ జనాల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తుంది!