'దీక్షలో ఉన్న ధీరుణ్ణి హతమార్చిన టీడీపీ గూండాలు'.. అంబటి ఫైర్!
ఎక్స్ వేదికగా సంచలన అంశాలను ప్రస్థావిస్తూ, ఆసక్తికర చర్చకు తెరలేపుతూ గత కొన్ని రోజులుగా ఫుల్ ఫామ్ లో ఉన్నట్లు కనిపిస్తున్న మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు .. తాజాగా మరో ట్వీట్ చేశారు.
By: Tupaki Desk | 26 Dec 2024 6:14 AM GMTఎక్స్ వేదికగా సంచలన అంశాలను ప్రస్థావిస్తూ, ఆసక్తికర చర్చకు తెరలేపుతూ గత కొన్ని రోజులుగా ఫుల్ ఫామ్ లో ఉన్నట్లు కనిపిస్తున్న మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు .. తాజాగా మరో ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సంచలన విషయాన్ని లేవనెత్తారు. ఇప్పుడు ఈ విషయం మరోసారి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
అవును... సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కొంతకాలం సైలంటుగా ఉన్నట్లు కనిపించిన అంబటి రాంబాబు.. ఇటీవల ఆన్ లైన్ వేదికగా ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు! ఇందులో భాగమా.. ఎక్స్ లో కీలక పోస్టులు పెడుతున్నారు. గత కొన్ని రోజులుగా 'పుష్ప-2' సినిమా, తదనంతర పరిణామాలపై వరుస ట్వీట్లు చేసిన ఆయన.. తాజాగా వంగవీటిపై స్పందించారు.
ఇవాళ వంగవీటి మోహన రంగా 36వ వర్ధంతి సందర్భంగా అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా... "దీక్షలో ఉన్న ధీరుణ్ణి టీడీపీ గూండాలు హతమార్చి నేటికి 36 సంవత్సరాలు... జోహార్ వంగవీటి మోహన రంగా!" అంటు అంబటి రాంబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీంతో... ఈ పోస్ట్ ఒక్కసారిగా వైరల్ గా మారిందని అంటున్నారు.
కాగా.. పేద, బలహీన వర్గాల నాయకుడిగా మాస్ ఇమేజ్ తెచ్చుకున్న వంగవీటి రంగా.. కాపు సామాజికవర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.. ఈ క్రమంలో పెద్ద ఎత్తున అభిమానాన్ని సంపాదించుకున్నారు! ఈ క్రమంలో 1988 డిసెంబర్ 26న పేదల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తున్న ఆయనను.. ప్రత్యర్థులు అతి దారుణంగా హత్య చేశారు!
ఈ నేపథ్యంలో... "దీక్షలో ఉన్న ధీరుణ్ణి టీడీపీ గూండాలు హతమార్చి నేటికి 36 సంవత్సరాలు" అంటూ అంబటి రాంబాబు చేసిన పోస్టు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారిందని అంటున్నారు. కాగా... వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే.