అంబటి వర్సెస్ పవన్ : బ్యానర్లు కట్టిన వైసీపీ మంత్రులు ఎవరు...?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ టూర్ ఉందంటే రాజకీయ సందడి మామూలుగా ఉండదు. ఆయన ఒకటి అంటారు
By: Tupaki Desk | 2 Dec 2023 4:39 PM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ టూర్ ఉందంటే రాజకీయ సందడి మామూలుగా ఉండదు. ఆయన ఒకటి అంటారు. వైసీపీ నుంచి నాలుగు వస్తాయి. మళ్ళీ ఇటు నుంచి పవన్ గట్టిగా మాట్లాడుతారు. అటు నుంచి రీ సౌండ్ వస్తుంది. సైలెంట్ గా ఉన్న పాలిటిక్స్ ని హీటెక్కించిన తరువాతనే పవన్ టూర్ ముగుస్తుంది. ఇది చాలా కాలంగా సాగుతూనే ఉంది.
తాజాగా పవన్ మంగళగిరికి వచ్చారు. ఆయన రెండు రోజులుగా పార్టీ ఆఫీసులో మీటింగ్స్ తో బిజీగా ఉంటున్నారు. ఈ సందర్భంగా కొంతమంది నేతలు జనసేనలో చేరారు. ఈ నేపధ్యంలో పవన్ మళ్లీ వైసీపీ మీద హాట్ కామెంట్స్ చేశారు. నా బ్యానర్లు కట్టిన వారు నా కోసం ఎదురు చూసిన వారు నా దృష్టిలో పడాలని తపించిన వారు ఈ రోజు మంత్రులు అయ్యారని కామెంట్స్ చేశారు.
మరి అలా పవన్ దృష్టిలో పడాలని కోరుకున్న వారు ఎవరు, అలా ఎవరు ఈ రోజున వైసీపీ మంత్రులుగా ఉన్నారు అన్నది చర్చకు వస్తోంది. అంతే కాదు పవన్ ముందు రోజు కూడా ఇలాగే మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను షూటింగ్ లో ఉంటే నా అపాయింట్మెంట్ దొరకక బయట ఉన్న వారు ఈ రోజు నన్ను విమర్శిస్తున్నారు అని. మరి ఇవన్నీ ఎవరి మీద అన్న సందేహాలు అందరిలో ఉన్నాయి.
అయితే పవన్ పేరు చెప్పకుండా చేసిన ఈ కామెంట్స్ కి వైసీపీ నుంచి కౌంటర్లు వచ్చాయి. అలా ఇచ్చినది మాత్రం మంత్రి అంబటి రాంబాబు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ బ్యానర్లు కట్టిన వారిని మంత్రులను చేసారు. పవన్ బ్యానర్లు కడితే ఏమొస్తుంది అని ప్రశ్నించారు. అసలు పవన్ తన కోసం బ్యానర్లు కట్టాలని ఎవరు వచ్చినా చంద్రబాబు టీడీపీ బ్యానర్లు కట్టమని పురమాయిస్తారని కూడా సెటైర్లు వేశారు.
అట్టడుగు స్థాయిలో ఉన్న వారిని సైతం పైకి తెచ్చి రాజకీయంగా అందలం ఎక్కించిన ఘనత కచ్చితంగా జగన్ కే దక్కుతుంది అని అంబటి అన్నారు. పవన్ కి నిలకడ లేదు, ఆయన రాజకీయం కూడా ఏపీ జనాలకు తెలుసు ఆయన్ని ఎవరు నమ్ముతారు అని అంబటి ఘాటుగానే రిప్లై ఇచ్చారు.
తన తల్లిని దూషించిన వారిని క్షమించనని, లోకేష్ ని అసలు క్షమించనని 2019 ఎన్నికల వేళ గర్జించిన పవన్ ఇపుడు లోకేష్ కి జై అంటున్నారని, జనసైనికులు కూడా ఆ పార్టీని వదిలేస్తారు అని అంబటి జోస్యం చెప్పారు.
మొత్తానికి చూస్తే పవన్ ఇండైరెక్ట్ గా అన్న మాటలకు అంబటి కౌంటర్ ఇచ్చారంటే ఆయన మీద ఈ కామెంట్స్ చేసారా అన్న చర్చ వస్తోంది.
అంతకు ముందు కూడా తమ ఇళ్ళలో జరిగే ఫంక్షన్లకు రమ్మని పిలుస్తారు, అపుడు మంచిగా ఉంటారు, కానీ ఆ తరువాత మీడియా ముందు కూర్చుని మాత్రం నన్ను విమర్శిస్తారు అని పవన్ అంబటి మీద కామెంట్స్ చేశారు. అంబటి కూతురు పెళ్ళికి పవన్ వచ్చారు.
అయితే దానికి కూడా అప్పట్లోనే అంబటి కౌంటర్ ఇచ్చారు. రాజకీయాలు వేరు వ్యక్తిగతాలు వేరు. దాన్ని దీనిని కలగాపులగం చేయడం పవన్ కే చెల్లింది అని కూడా సెటైర్లు వేశారు. ఇపుడు చూస్తే నా బ్యానర్లు కట్టిన వారు మంత్రులు అయ్యారు అంటూ పవన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతూంటే అంబటి కౌంటర్లు కూడా దానితో పోటీ పడుతున్నాయి. ఈ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ మాత్రం ఇంటరెస్టింగ్ గానే ఉంది. ఎన్నికల వేళ మరెంతగా ఇది సాగుతుందో చూడాల్సి ఉంది.