అంబటి రాయుడి తీరే అంత..
టీమ్ ఇండియా మాజీ ఆటగాడు, తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది.
By: Tupaki Desk | 25 Feb 2025 3:31 AM GMTటీమ్ ఇండియా మాజీ ఆటగాడు, తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. నిన్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌కు తెలుగు కామెంట్రీలో సభ్యుడిగా ఉన్న అంబటి రాయుడు.. ఈ దుబాయ్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ను వీక్షిస్తున్న సుకుమార్ గురించి ప్రస్తావన వచ్చినపుడు చేసిన కామెంట్ దుమారం రేపింది. ఇలాంటి మ్యాచ్‌లకు హాజరైతే టీవీల్లో ఎక్కువ కనిపిస్తారనే ఉద్దేశంతోనే సెలబ్రెటీలు వస్తారని.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని రాయుడు వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్ విషయంలో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు రాయుడు.
చిన్న వయసులోనే ఎంతో ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకుని భారత జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించిన రాయుడి లాంటి పెద్ద ఆటగాడు ఇలాంటి కామెంట్ చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇంకెవరినో అన్నా ఓకే కానీ.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే, మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండే, అసలు పబ్లిసిటీనే కోరుకోని సుకుమార్ లాంటి దర్శకుడిని ఉద్దేశించి ఇలాంటి కామెంట్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఈ సందర్భంగా రాయుడి నోటి దురుసు, వ్యవహార శైలి గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. హైదరాబాద్ క్రికెట్ సంఘంలో ఇబ్బంది తలెత్తితే.. ఆవేశపడి రెబల్ లీగ్ అయిన ఐసీఎల్‌లో చేరి బీసీసీఐ నిషేధాన్ని ఎదుర్కొన్న ఆటగాడు రాయుడు. అప్పుడు ఆవేశంతో తీసుకున్న ఆ నిర్ణయంతో కెరీర్లో చాలా నష్టపోయాడు. ఇక నిషేధం తొలగిపోయి ఐపీఎల్‌లోకి వచ్చాక కూడా అతడి వ్యవహార శైలి పలుమార్లు విమర్శలకు దారి తీసింది.
హర్భజన్ లాంటి లెజెండరీ క్రికెటర్‌తో గొడవ పడడం మొదలు.. తనకు ప్రపంచకప్ జట్టులో చోటివ్వలేదని ఎమ్మెస్కే ప్రసాద్ మీద సెటైరికల్ ట్వీట్ వేయడం వరకు రాయుడి చుట్టూ ఎన్నో వివాదాలున్నాయి. రాయుడి రాజకీయ ప్రవేశం విషయంలో జరిగిన డ్రామా గురించి చెప్పాల్సిన పని లేదు. గుంటూరు ఎంపీ టికెట్ ఆశించి వైసీపీలో చేరడం.. జగన్‌ను కొనియాడడం.. చివరికి అక్కడ ఏదో తేడా కొట్టి ఆ పార్టీకి రాజీనామా చేయడం.. మళ్లీ జనసేనలోకి రావాలని చూడడం.. చివరికి అక్కడా అవకాశం లేక రాజకీయాల నుంచి వైదొలగడం.. ఇలా రాయుడి వ్యవహార శైలి ఎప్పుడూ వివాదాస్పదం, అనుమానాస్పదమే. ఇలాంటి చరిత్ర ఉన్న వ్యక్తి సుకుమార్ మీద ఇలాంటి కామెంట్ చేయడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు.